పాస్‌పోర్టు కన్నా పక్కాగా! | CM KCR announcement on new passbooks in Assembly | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు కన్నా పక్కాగా!

Published Wed, Nov 8 2017 4:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

CM KCR announcement on new passbooks in Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘ఒక రైతు ఇంకో రైతుకు తన భూమిని అమ్మాడు.. ఇద్దరూ కలసి పాస్‌ పుస్తకాలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్లారు.. వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగిపోవాలి. ఆ తర్వాత ఈ వివరాలన్నీ గంటలో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తాయి. అక్కడ కూడా అదే రోజు మ్యుటేషన్‌ జరిగిపోవాలి. లేదంటే తెల్లారి అయిపోవాలి. పాస్‌ పుస్తకాల కోసం తహసీల్దార్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కట్టే కొరియర్‌ చార్జీలతోనే పాస్‌పోర్టు లాగా పాస్‌ పుస్తకాలు టపాలో వస్తాయి. రెవెన్యూ వ్యవస్థలో బ్యాంకుల తరహా కోర్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. టూల్‌ ప్రాసెసింగ్‌ కూడా అవుతోంది. దాంట్లోనే రికార్డులన్నీ అప్‌లోడ్‌ చేస్తాం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ప్రక్షాళన చేసిన భూరికార్డుల ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. జనవరి 26 నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 26 రకాల భద్రతా చర్యలతో, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా పాస్‌పోర్టు కన్నా పక్కాగా పాస్‌ పుస్తకాలను తయారు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం అసెంబ్లీలో భూరికార్డుల ప్రక్షాళనపై జరిగిన లఘు చర్చకు సమాధానమిస్తూ సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే...

రికార్డుల్లో గందరగోళం వల్లే సమస్యలు
భూముల వివరాలు, రికార్డుల విషయంలో ప్రజలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు.. రాస్తే రామాయణమంత, వింటే భారతమంత. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. భూరికార్డుల్లో వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రస్తుత కామారెడ్డిలోని గాంధారి మండలం గుజ్జల అనే గ్రామంలో ఖాస్రాలో 1403.13 ఎకరాలుంటే.. 1బీ ప్రకారం 1795.13 ఎకరాలుంది. రికార్డుల్లోనే 392 ఎకరాల తేడా ఉంది. మరో గ్రామంలో 3 వేల ఎకరాల తేడా ఉంది. ఇలా వింత, అస్తవ్యస్త, గందరగోళంగా రికార్డులు తయారు చేశారు కాబట్టే చాలా మంది చెలరేగిపోయారు. పైరవీకారులు, ల్యాండ్‌ మాఫియా, నకిలీ పత్రాలు, పాస్‌ బుక్కుల సృష్టికర్తలు, డబుల్‌ రిజిస్ట్రేషన్లు.. ఇలా అనేక అకృత్యాలు జరిగాయి.

నిజాం రాజులు మంచి పనులు చేశారు
మన రెవెన్యూ వ్యవస్థకు ప్రాతఃస్మరణీయుడు సాలార్‌జంగ్‌–1. 1932–34 వరకు ఉన్న నిజాం రాజు సర్వే సెటిల్‌మెంట్‌ చేశారు. నిజాం విషయంలో అనేక అభిప్రాయాలుంటాయి. కానీ మా దృష్టిలో మాత్రం ప్రపంచంలో ఎవరూ చేయని మంచి పనులు చేశారు. పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లాలో జల్, జంగల్, జమీన్‌ పేరుతో కొమురం భీం పోరాటం చేస్తే తన దేశం వాళ్లయితే తప్పుడు నివేదిక ఇస్తారేమోనని హైమన్‌డార్ఫ్‌ అనే ఫ్రెంచ్‌ దేశస్తుడితో కమిషన్‌ వేయించి, ఆ నివేదిక ఆధారంగా లక్ష ఎకరాలు పంచిన చరిత్ర నిజాంది. కానీ, మన సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా నిజాం చరిత్రను చెరిపి, నలిపివేసి మలినం చేశారు. సర్వస్వతంత్ర హైకోర్టును, స్వతంత్ర న్యాయవ్యవస్థను కూడా ప్రపంచంలో మొదట ఏర్పాటు చేసింది నిజాం రాజే. నిజాం రాజు ఏర్పాటు చేసిన స్వతంత్ర న్యాయ వ్యవస్థ కారణంగా మా కుటుంబం లబ్ధి పొందింది. అప్పట్లో 1939–40 ప్రాంతంలో అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కింద మా భూములు పోయాయి. కానీ పరిహారం సరిపోలేదని మా నాన్న కోర్టుకెళ్తే మాకు ఇంకా రూ.70 వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని నిజాం రాజు చెల్లించాడు.

ఆషామాషీగా ప్రారంభించలేదు..
భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆషామాషీగా ఏమీ ప్రారంభించలేదు. దీన్ని ప్రారంభిస్తున్నప్పుడు నాకు కూడా సందేహాలు కలిగాయి. మిర్యాలగూడ, భువనగిరి ఆర్డీవోలను క్షేత్రస్థాయికి పంపించాం. రంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లతో పరిస్థితిని అధ్యయనం చేయించాం. వారి అనుభవాలను పరిశీలించాకే ఓ నిర్ధారణకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీన్ని 100 శాతం పారదర్శకతతో అమలు చేస్తున్నాం. అప్పటికప్పుడు పరిష్కారం కానివి తప్ప మిగతావన్నీ సరి చేయమంటున్నాం. దాదాపు 55 లక్షల మంది రైతు కుటుంబాలతో ముడిపడి ఉన్న సమస్య ఇది. దీనికోసం టాంటాం వేయిస్తున్నాం. రైతులకు నోటీసులిస్తున్నాం. పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాం. తెలంగాణలో మొత్తం 2.76 కోట్ల ఎకరాల భూభాగం ఉంది. 10,885 రెవెన్యూ గ్రామాలున్నాయి. అందులో గ్రామీణ రెవెన్యూ గ్రామాలు 10,806. వాటిలో మొదటి దశలో 6,242 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన ప్రారంభం కాగా.. 3,500 గ్రామాల్లో పూర్తయింది. 1,418 బృందాలు అహోరాత్రులు పాల్గొంటున్నాయి. మరో వారం రోజుల్లో 2,742 గ్రామాల్లో పూర్తయితే మొత్తం 60 శాతం అయిపోతుంది. మిగిలిన 40 శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ 31 కల్లా పూర్తి చేస్తాం. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో ప్రక్షాళన చేస్తాం. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం అన్ని వివాదాలు పరిష్కారమై, సమస్యలు రాని భూమి (పార్ట్‌–ఏ) 87 శాతంగా తేలింది. అందులో 14 జిల్లాల్లో ఇది 90 శాతం కన్నా ఎక్కువ ఉంది.

మరి మేం చేసింది ప్రజలకు ఎలా చెప్పాలి?
కాంగ్రెస్‌ వింత వైఖరి అవలంబిస్తోంది. అసెంబ్లీలో మేం చేసింది చెప్పుకుంటే సభను ప్రచార వేదికగా వాడుకుంటామంటున్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇస్తే డబ్బు వృథా అంటున్నారు. మరి మేం చేసింది ప్రజలకు ఎలా చెప్పాలి? అయినా భూరికార్డుల ప్రక్షాళన కోసం అన్ని భాషల పత్రికల్లో కలిపి మేం ఇచ్చిన ప్రకటనల విలువ కేవలం రూ.7.35 కోట్లే. నేను పుట్టిన చింతమడక పడమటి గడ్డపై 93 ఎకరాలను 136 మందికి అసైన్‌ చేశారు. ఈ భూమిని కొందరు అమ్ముకున్నారు. కొన్నవారు కూడా దాదాపు అదే సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే అసైన్డ్‌ విషయంలో గ్రామం ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం. అసైనీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనీయం. భూదాన భూములపై సిన్హా కమిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయి. నయీం ఆక్రమించిన భూములు, మియాపూర్‌ భూములు.. ఇలా అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. వాటికి, రెవెన్యూ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదు. వారికి అధికారిక కార్యక్రమాల్లో తలదూర్చే అవకాశం లేదు.

కాగితాల్లేకుండానే రుణాలిచ్చే విధానం తెస్తాం
రికార్డుల ప్రక్షాళన వివరాలు అప్పుడే ఆన్‌లైన్‌లో పెట్టొద్దని చెబుతున్నాం. ముందు హార్డ్‌కాపీ తయారు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్‌ కార్యాలయాలతోపాటు రెÐవెన్యూ ఉన్నతాధికారులు, సీఎం, సీఎస్‌ల కార్యాలయాల్లో ఐటీ అధికారులను నియమిస్తాం. వారే రెవెన్యూ రికార్డుల వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. భూమికి సంబంధించిన రికార్డుల అప్‌డేషన్‌ 100 శాతం డైనమిక్‌గా ఉంటే జీడీపీ దానంతట అదే 2 శాతం పెరుగుతుందని అనేక అధ్యయన సంస్థలు, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీలు చెప్పాయి. రిజిస్ట్రేషన్‌ బాధల నుంచి ప్రజలు విముక్తులు కావాలి. ప్రస్తుతం ఉన్న 141 రిజిస్ట్రేషన్‌ కార్యాయాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. మిగిలిన 443 మండలాల్లో తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు ఇస్తాం. గతంలో ముక్కుపిండి వసూలు చేసే భూమి పన్నే ఆదాయవనరుగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే భూమికి పెట్టుబడి ఇస్తా అనే కాలం వచ్చింది. మనం కూడా కాలాన్ని బట్టి మారాలి. నా అభిప్రాయాన్ని బట్టి రైతుకు ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. అన్నీ ఒకే సర్వే నంబర్‌లో ఉండాలి. ఇది నా ప్రతిపాదన మాత్రమే. మ్యుటేషన్‌ అధికారాలు కూడా తహశీల్దార్లకు ఇస్తున్నాం. పంటరుణాల కోసం రైతుల పాస్‌ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టుకోకూడదు. ఆన్‌లైన్‌లోనే కాగితాల్లేకుండా రుణాలిచ్చే విధానాన్ని అమల్లోకి తెస్తాం. భూరికార్డుల ప్రక్షాళనలో పాలుపంచుకుంటున్న రెÐðవెన్యూ సిబ్బందికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇస్తాం.

పాస్‌బుక్కులపై ఇంకెవరూ రాయలేరు..
వచ్చే ఏడాది మే నెల నుంచి ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నాం. అందుకే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టాం. ఈ రికార్డుల ఆధారంగానే పెట్టుబడి సాయం ఇస్తాం. జనవరి 26 నుంచి కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తాం. 26 రకాల భద్రతా చర్యలతో వీటిని తయారు చేస్తున్నాం. నెలరోజులు నీళ్లలో ఉన్నా ఇది పాడు కాదు. దీనిపై ఇంకెవరూ ఏమీ రాయలేరు. దీనిపై రాసే పెన్నులు కేవలం రెవెన్యూ అధికారుల వద్దే ఉంటాయి. పాస్‌పోర్టు కంటే బాగుండే టాంపర్‌ చేసే వీల్లేని పాస్‌పుస్తకాన్ని తయారు చేస్తున్నాం. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్రంలోని అందరు రైతుల రికార్డులు అందుబాటులో ఉంచుతాం. వీటిని ప్రజలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఒక కాపీ ఇస్తాం. ఫిబ్రవరి నెలలో పట్టణాల్లో ప్రక్షాళన జరుపుతాం. అవసరమైన చోట్ల సర్వే చేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement