మండలి నుంచి కేబినెట్ భేటీకి ఒకే కారులో వస్తున్న సీఎం కేసీఆర్, ఆర్థికమంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటాన్ అకౌంట్ తో పోలిస్తే సాధారణ బడ్జెట్‌కు భారీగా కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక ఏడాదికి కూడా వాస్తవిక కోణంలోనే బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పెరుగుదల అంచనాలను పరిగణనలోకి తీసుకుని గతేడాది బడ్జెట్ అంచనాల కన్నా 8% పెరుగుదలతో రూ. 1.58 లక్షల కోట్ల వరకు 2020– 21 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం వరకు ఉంటుందనే అంచనాలు, కోవిడ్ ప్రభావంతో పారిశ్రామిక రంగ ఆదాయం పడిపోతుందేమోననే భయం ఉన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాది రాబడులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉండటంతో ఈ మేరకు బడ్జెట్ అంచనాలకు వెళ్లవచ్చనే నిర్ధారణకు ఆర్థికశాఖ వర్గాలు వచ్చాయని సమాచారం. దీంతో గతేడాది రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, మరో రూ.12 వేల కోట్ల వరకు కలిపి మొత్తం రూ.1.58 లక్షల కోట్ల మేర బడ్జెట్ అంచనాలను అసెంబ్లీ ముందుం చేందుకు సిద్ధమయిందని సమాచారం. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు తొలిసారి ఆది వారం ఉదయం 11:30 గంటలకు 2020– 21 వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.
కీలక రంగాలకు అదే ప్రాధాన్యం..
ఈసారి బడ్జెట్ లో కీలక రంగాలకు ప్రాధాన్యత మేరకు నిధులు కేటాయించనున్నారు. ప్రస్తు తం అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే విద్య, వైద్యం, సాగునీటి శాఖలతో పాటు ఈసారి గృహ నిర్మాణానికి (డబుల్ బెడ్ రూం ఇళ్లు) ఎక్కువ నిధులు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తు న్న విమర్శలకు తాళం వేసేందుకు బడ్జెట్‌లో నిధులు పెంచాలని, ఆ మేరకు ఇళ్లు కట్టి చూపించాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షలు ఇవ్వాలన్న హామీకి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గృహ నిర్మాణ శాఖకు నిధులు పెరగనున్నాయి. సాగునీటి శాఖకు ఈ సారి రూ.8,500 కోట్లు కేటా యించే అవకాశముంది. గతేడాది కన్నా రూ.1000 కోట్లు అధికంగా కేటాయించడంతో పాటు మరో రూ.15 వేల కోట్ల వరకు అప్పులు ప్రతిపాదించడం ద్వారా మొత్తం రూ.23,500 కోట్ల వరకు వచ్చే ఏడాది సాగునీటి రంగంపై ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక విద్య, వైద్యానికి గత ఏడాది కన్నా కేటాయింపులు పెంచనున్నారు. ఆపద్బంధు, కుట్టుమిషన్ల పంపిణీ బాధ్యతలను కూడా సంక్షేమ శాఖలకే అప్పగించనున్నారు.
సగం రుణమాఫీకి యోచన...
వ్యవసాయ రంగానికి కూడా నిధులు అంచనాలకు అనుగుణంగానే కేటాయించనున్నారు. ఈసారి రైతు రుణమాఫీకి గతేడాది కేటాయిం చిన రూ.6 వేల కోట్లతో పాటు మరో రూ.6 వేల కోట్లు ప్రతిపాదిస్తారని, మొత్తం రుణమాఫీ అమలుకు రూ.24వేల కోట్లు అవసరమవుతాయనే లెక్కల్లో సగం కేటాయించడం ద్వారా వచ్చే ఏడాది రెండు దఫాల్లో రైతుల రుణాలను సగం మేర మాఫీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అదే విధంగా రైతు బీమాకు గత ఏడాది కేటాయించిన రూ.700 కోట్లను రూ.1000 కోట్ల వరకు పెంచనున్నారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రూ.7,500 కోట్ల వరకు ఖర్చు కానున్నాయి.
ఇక, జీతభత్యాలు, అప్పులకు వడ్డీల చెల్లింపులు, సబ్సిడీలు, విద్యుత్ రాయితీలకు కలిపి మరో ప్రణాళికేతర పద్దుల కింద రూ.50 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు ఈ ఏడాది ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము మాట ఇచ్చింది వాస్తవమేనని, అయితే వీటి అమలుకు తమకు సమయం ఉందని సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటికి ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు లేవనే తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పుడు జీఎస్‌డీపీ రూ.4 లక్షల కోట్లుందని, గత ఏడాది రూ.8.6 లక్షల కోట్లుండగా, ఈ సారి రూ.9.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని కాగ్ లెక్కలు చెబుతున్నాయని సీఎం అసెంబ్లీలో చెప్పారు.
దీని ఆధారంగా వివిధ శాఖల అవసరాలను క్రోఢీకరించి రూ.1.58 లక్షల కోట్ల వరకు ఈసారి అంచనాలు ప్రతిపాదించవచ్చనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోనూ కోత పడే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.3 కోట్లుగా ఉన్న ఏసీడీఎఫ్ నిధులను రూ.1.5 కోట్లకు పరిమితం చేయనున్నట్లు సమాచారం.
బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి శనివారం రాత్రి ప్రగతి భవన్‌లో సమావేశమై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న తీర్మానం ప్రతిపై సైతం మంత్రివర్గ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిసింది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల విషయంలో శాసనసభలో ప్రభుత్వం అవలంబించాల్సిన వైఖరిపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment