అన్నదాతకు అందలం | Telangana Assembly Budget Session On Agriculture By Harish Rao | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అందలం

Published Mon, Mar 9 2020 2:35 AM | Last Updated on Mon, Mar 9 2020 2:35 AM

Telangana Assembly Budget Session On Agriculture By Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ, అను బంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద కేవలం వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్‌శాఖలకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 177 కోట్లు కేటాయిం చింది.

వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్‌లో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలకే అగ్రస్థానం కల్పిం చారు. రైతు బంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు కేటా యించారు. 2018–19 బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయించగా దానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కొత్త పాస్‌పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరగనుండటంతో పెరిగే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లు అదనంగా పెంచినట్లు సర్కారు తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికా వడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రైతుబంధుకు గత బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ముకు 1.20 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకోగా ఈసారి కొత్త పాస్‌పుస్తకాల సంఖ్య పెర గడం, ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగిందన్న అంచనాతో 1.40 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రైతుబంధు ద్వారా 2018–19 ఖరీఫ్‌లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేయగా 2019–20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు...
గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం తెలిసిందే. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్త తేడా ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించి అందుకు అనుగుణంగా రూ. 16,124 కోట్లను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్‌లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రూ. 25 వేలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉండగా వారందరి రుణాలను నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త నిర్ణయం.

గతానికి ఇప్పటికీ ఇదే ప్రధాన తేడా. ఒకేసారి వారందరికీ రూ. 1,198 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తారు. అది కూడా ఈ నెలలోనే ఇస్తారు. ఇక రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు ఉన్న రుణాలు రూ. 24,738 కోట్లుగా ఉండగా ఆయా రైతుల సంఖ్య ఎంతనేది వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సొమ్మును మాత్రం నాలుగు విడతలుగా అందజేస్తారు. అంటే నాలుగేళ్లలో క్లియర్‌ చేసే అవకాశముంది. వాటిని కూడా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగానే అందిస్తారు.

మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ. 1,000కోట్లు
ఈ బడ్జెట్లో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విష యంలో పరిమితి విధిస్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ ఏడాది పండిన కందులలో కొద్ది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులను కొనుగోలు చేయాలని బడ్జెట్‌లో స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రూ.600 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది.

రైతు బీమాకు రూ. 1,141 కోట్లు..
రైతు బీమాకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు, ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షలు అందించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి రైతుకూ బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతి రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్‌ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది.

ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్‌లో రూ. 100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు.

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ భావించినా బడ్జెట్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 304.34 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేటాయింపులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు. విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు చేశారు.

రైతు బడ్జెట్‌
ఇది రైతు బడ్జెట్‌ అని మళ్లీ నిరూపితమైంది. బడ్జెట్‌లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరం. రైతుబంధు పథకానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు రైతు రుణాల మాఫీ కోసం రూ. 6,225 కోట్లు కేటాయించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్ల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించడం సాహసోపేతమైన చర్య. – నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement