బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్న మంత్రి హరీశ్. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాపై సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు. మేం ఎంచుకున్న బాట సరైందని, మేం అవలంభిస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని తేల్చిచెప్పారు. మా పంథా ఇకపైనా కొనసాగించే నిర్ణయంతో వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్తు పురోగతికి ప్రణాళిక రచన చేశాం. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహనతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రజల ముందుంచుతున్నాం. ఇది కేవలం వార్షిక బడ్జెట్ ధృక్పథంతో కాకుండా ప్రజలే కేంద్రంగా ప్రగతిశీల బడ్జెట్ రూపొందించాం’’అని 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు స్వాగ తిస్తున్నారని, అదే ఉత్సాహంతో వచ్చే నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో వచ్చే సంవత్సరానికి వాస్తవిక, ప్రగతిశీల బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో 62 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం సాగింది. తన ప్రసంగం ప్రారంభానికి ముందు సీఎం చాంబర్‌లో, ప్రసంగం ముగించాక సభలో హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
సంక్షేమంలో కోత లేదు..
‘‘సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో ఎక్కడా కోత విధించలేదు. పైగా లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కావాల్సిన నిధులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో పనిచేస్తోందో ఈ బడ్జెట్ అంకెలే చాటిచెబుతున్నాయి. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటమే.ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది.
ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా..
దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్ర సొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 6.3 శాతం తగ్గి 15.2 శాతం వద్ద నిలిచింది. ఇక 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. గత ఎన్నికల్లో కూడా ఆ హామీ ఇచ్చాం. ఆర్థిక మాంద్యం ముందరి కాళ్లకు బంధం వేస్తునప్పటికీ దాని అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
రాష్ట్రమే టాప్..
తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. 2019–20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216గా ఉంటే దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050గా ఉంది. ఇది మన ప్రగతికి స్పష్టమైన సంకేతం.
అంబేడ్కర్ మాటలు
మననం చేసుకుంటూ...
సమాజ వికాసానికి నిజమైన కొలమానం మహిళాభివృద్ధి స్థాయేనని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు. ఆయన మాటలను మననం చేసుకుంటూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి , కేసీఆర్ కిట్ పథకాలతో మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
57 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛన్..
కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధా ప్య పింఛన్లు అందించబోతున్నాం. దీనివల్ల 39,41,976 ఆసరా పెన్షన్ల సంఖ్య భారీ గా పెరగనుంది. గత బడ్జెట్‌లో ఆసరా పెన్షన్లకు రూ. 9,402 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో ఆ కేటాయింపులను రూ. 11,758 కోట్లకు పెంచాం.
కాళేశ్వరం వెనుక కేసీఆర్ ఉక్కు సంకల్పం..
కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రూపొంది రికార్డు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పమే కారణం. ఫలితంగా గోదావరి 150 కి.మీ. మేర జీవధారగా మారింది. ఇది తెలంగాణ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఉపయోగపడుతుంది. ఇదే స్ఫూర్తి తో పాలమూరు–రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కొద్ది కాలంలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుంది.
వృద్ధిరేటుకు పన్నుల వాటా ఎసరు..
2019–20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్‌లో వేసుకున్న అంచనాల కంటే రూ. 3,731 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రానికి కేంద్రం నంంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారంలో నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018–19లో 16.10 శాతం ఉంటే 2019–20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment