సాక్షి, హైదరాబాద్: పోడు వ్యవసాయం చేసుకునేవారికి కూడా రైతు బీమాను వర్తింపచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి చెప్పాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యులు వెంకటేశ్వరరెడ్డి, బాల్క సుమన్, సతీశ్‌కుమార్‌లు రైతుబీమా గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క పోడు వ్యవసాయం చేసుకుంటున్నవారి గురించి అడిగారు. ఆ రైతులకు కూడా రైతు బీమాను వర్తింపచేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, వారికి కూడా అండగా ఉంటామని మంత్రి సమాధానం చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సీతక్క గట్టిగా పేర్కొంటుండటంతో, పురాణగాథల్లో సహనానికి మారుపేరుగా ఉన్న సీతమ్మ తరహాలో, ఆపేరుతో ఉన్న సీతక్క కూడా ఓపికగా ఉంటే అన్నింటికి సమాదానాలు వస్తాయని మంత్రి చమత్కరించారు. రైతు బీమా లబ్ధి అందటం లేదన్న అంశానికి ఆయన వివరణ ఇస్తూ, శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 31 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ 164 మండలాల్లో కూడా గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment