
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. బీఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా.. సభ్యులు సభకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు కడియం. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే బీజేపీ మొదటి ప్రశ్నను వాయిదా వేసుకుని గొడవ చేయడమేంటని ప్రశ్నించారు. సభకు రానప్పుడు ప్రశ్నను వాయిదా వేసుకోవడం జరుగుతుంది కానీ.. సభకు వచ్చి ప్రశ్నను వాయిదా వేసుకోవడం సరికాదన్నారు.
అవసరమైతే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత నిరసన వ్యక్తం చేసుకోవచ్చుని కడియం సూచించారు. సభకు ఆటంకం కలిగించడం భావ్యం కాదని.. అలాంటి పద్ధతులు మానుకుంటే బాగుంటుందని కడియం శ్రీహరి అన్నారు. స్వల్ప కాలిక చర్చకు అనుమతిచ్చినా.. బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంపై డిప్యూటీ సీఎం మండిపడ్డారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి వేరే సభ్యుడి వద్దకు వెళ్లి మైక్ తీసుకుని మాట్లాడనివ్వక పోవడం భావ్యం కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కడియం శ్రీహరి మరోసారి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment