
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై మల్లగుల్లాలు
విధేయత, అనుభవం, ప్రాంతీయ ఆధారంగా చర్చ
దక్షిణాదికి ఇవ్వదలిసేత్ ముందు వరుసలో కిషన్‌రెడ్డి
మహిళ అయితే తమిళనాడు నుంచి వనతి శ్రీనివాసన్
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
భిన్న ప్రాతిపదికలు..
జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది.
దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది.
ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది.
విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది.
ఇక ఆర్‌ఎస్‌ఎస్ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్‌లాల్ ఖట్టర్, శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్‌ఎస్‌ఎస్ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment