
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనే చర్చ కొలిక్కిరాకముందే, ఈ వ్యవహారంపై ఈసీ నిర్ణయం తీసుకోకముందే అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. ‘సంపత్ కుమార్ ప్రాతినిధ్యవ వహిస్తున్న ఆలంపూర్ శాసనసభ స్థానం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయిన’ట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్‌ఎస్‌లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఆశావాహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్నవారిలో ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.
20న ప్రకటన? : నల్లగొండ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ తరఫున కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీచేస్తారని కొద్ది గంటలుగా పెద్ద ఎత్తునప్రచారం సాగుతోంది. భూపాల్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్)పై పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. నాటి ఎన్నికల్లో భూపాల్ గణనీయంగా ఓట్లు సాధించడంతో టీఆర్‌ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకున్న ప్రజాదరణను బట్టి పార్టీలో చేర్చుకోవడమేకాక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ బాధ్యతలు కట్టబెట్టారు టీఆర్‌ఎస్ పెద్దలు. ఇప్పటికే నల్లగొండలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ ఈ నెల 20న ప్రగతి సభను నిర్వహించాలని భావిస్తున్నది. ఆ సభలోనే భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆలంపూర్ నియోజకవర్గ అభ్యర్థిపై తర్జనభర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక, అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటనలు లేవు.