సాక్షి, హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేనని, ఒకవేళ ఆయన కూడా తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికకూ సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్లను నిరసిస్తూ సంపత్‌కుమార్‌తో కలిసి గాంధీభవన్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ దీక్ష చేస్తోన్న ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
సెమీస్‌కు సిద్ధం : ‘కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా మాపై వేటు వేశారు. దీనిపై గవర్నర్ విచారణ చేయాలి. ఒకవేళ అక్కడ కూడా వ్యతిరేక నిర్ణయం వస్తే ప్రజల దగ్గరికెళ్లి తేల్చుకుంటాం. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తామంటోన్న టీఆర్‌ఎస్.. ఉప ఎన్నికలంటూ హడావిడి చేస్తోందికదా, వాళ్లకిదే నా సవాల్.. మేం సెమీ ఫైనల్స్ కు సిద్ధంగా ఉన్నాం. 2019లో జరిగే ఫైనల్స్‌లో 100కుపైగా సీట్లు సాధిస్తాం’ అని కోమటిరెడ్డి అన్నారు.
పోలీస్ రాజ్యమిది : షబ్బీర్ ఫైర్
తమ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డిల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు గాంధీభవన్‌కు వెల్లువలా వస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ పోలీసుల రాజ్యాన్ని నడిపిస్తున్నారు. అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేయడమేకాక, ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment