సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్‌ఏ సంపత్‌కుమార్ (అలంపూర్)లపై వేటు పడింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంగళవారం అసెంబ్లీ తీర్మానించింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌కు చెందిన మిగతా 11 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది. మరోవైపు శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
దురదృష్టకరమైన ఘటన..
సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ సెట్‌ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడ్డారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధికారపక్షం.. నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. స్పీకర్ మధుసూదనచారి వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న అనంతరం దీనిపై మాట్లాడారు. ‘‘గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో దుర్మార్గమైన, దురదృష్టకమైన, అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. సభకు నా తీవ్ర మనస్తాపాన్ని తెలియజేస్తున్నా.. నాలుగేళ్లుగా దేశంలోనే గొప్పగా, గౌరవంగా సభను నిర్వహిస్తున్నాం. నేను తీవ్రంగా మనస్తాపం చెందాను. దాడితో దెబ్బతిన్న స్వామిగౌడ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను..’’అని పేర్కొన్నారు.
సభా నిబంధనల మేరకు..
తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చను మిగిల్చింది. మీ (స్పీకర్) తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు అనుగుణంగా అసెంబ్లీ నిబంధనల (240 పేజీలోని సబ్ రూల్ 2) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్.పద్మావతి, దొంతి మాధవరెడ్డిలను బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను. నిన్న జరిగిన దాడి చాలా చాలా తీవ్రమైనది. చట్టసభలను అవమానపరిచేలా, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగింది. ఈ విషయంలో శాసనసభ తీవ్ర వేదనకు గురైంది. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కలిగించడానికి కారణమైన వారిపై పార్లమెంటరీ నిబంధనల (120 పేజీలోని 7.1 పేరా, రాజ్యాంగంలోని 194లో మూడో సెక్షన్) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను ప్రస్తుత శాసనసభ కాలం ముగిసేవరకు రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను..’’అని తెలిపారు. ఈ తీర్మానాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. సభ ఆమోదం కోరారు. అనంతరం తీర్మానాలను ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటికే మార్షల్స్ సభలోకి ప్రవేశించారు. అందులో మహిళా మార్షల్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొలుత వారు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి వద్దకు వచ్చి బయటికి తీసుకెళ్లబోయారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం గమనార్హం.
మండలిలో గందరగోళం..
శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గందరగోళానికి బాధ్యులను చేస్తూ వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మంగళవారం శాసన మండలి ప్రారంభమైన వెంటనే.. కాంగ్రెస్ సభ్యులు విపక్ష నేత షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన సభ్యులు సభను వీడి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు బయటికి వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సస్పెండైన సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఉండదని, బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి మార్షల్స్‌ను రప్పించి.. కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment