సాక్షి, హైదరాబాద్: న్యాయ పోరాటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లు విజయం సాధించారు. వీరిద్దరిని బహిష్కరిస్తూ ఈ ఏడాది మార్చి 13న అసెంబ్లీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను, వారి స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. వారి బహిష్కరణ పూర్తిగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టంచేసింది. బహిష్కృతులకు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం, బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను అందజేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలకు వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని, అయితే వారిపై ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుని ఉన్నా, తీసుకోవాలని భావిస్తున్నా అందుకు ఏదీ అడ్డంకి కాదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం తీర్పునిచ్చారు. వీరిద్దరి విషయంలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుతోపాటు వారి ప్రాథమిక హక్కులను సైతం హరించారని న్యాయమూర్తి తన 172 పేజీల తీర్పులో వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ వల్ల మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందని అధికార పార్టీ ఆరోపించింది. కోమటిరెడ్డితో పాటు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. అంతేగాక వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెడ్‌ఫోన్ విసరడం వల్లే స్వామిగౌడ్ కంటికి గాయమైనట్లు ఆరోపణలు వచ్చినందున అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని వారు తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు విచారణ జరిపి ఇటీవల తీర్పును వాయిదా వేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు వెలువరించారు. వాస్తవానికి మంగళవారం విచారణ కేసుల జాబితాలో ఈ కేసు ప్రస్తావన లేదు. అయితే అకస్మాత్తుగా 1.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారని, పిటిషనర్, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు హాజరు కావాలన్న సమాచారంతో కోర్టు డిస్‌ప్లే బోర్డుల్లో స్క్రోలింగ్ వచ్చింది. దీంతో కోర్టు న్యాయవాదులతో కిటకిటలాడింది. తీర్పు పూర్తి పాఠం ఇదీ..
అసలు సభ తీర్మానమే అవసరం లేదు
ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శుల తరపున తాను హాజరవుతున్నట్లు అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అంతేకాక వీడియో ఫుటేజీలను సమర్పించాలంటూ ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని, వీడియో ఫుటేజీ ఒరిజినల్ రికార్డులను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు కూడా దాఖలు చేస్తామన్నారు. ఏజీ హామీని, కౌంటర్ల దాఖలు చేస్తామన్న విషయాన్ని కూడా మా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నాం. కౌంటర్ల దాఖలుకు రెండుసార్లు గడువు కూడా తీసుకున్నారు. దీన్ని ఈ కేసు ప్రొసీడింగ్స్‌లో అసెంబ్లీ కార్యదర్శి పాలుపంచుకున్నట్లు మా డాకెట్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా.. ఈ కేసులో వాదనలు వినిపించకూడదని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలు ఉండి కూడా వాటిని సమర్పించకుంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ఫుటేజీలోని అంశాలకు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని కూడా చెప్పాం. అయినా వీడియో ఫుటేజీని సమర్పించ లేదు. వీడియో ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరమని వాదనల సమయంలో అదనపు ఏజీ రామచంద్రరావు చెప్పారు. వాస్తవానికి ఏదైనా డాక్యుమెంట్ సమర్పణకు సభ తీర్మానం ఎంత మాత్రం అవసరం లేదు. సభ నిర్వహణ రూల్స్‌లోని 351 రూల్ ప్రకారం.. సభకు సంబంధించిన అన్ని రికార్డులు, డాక్యుమెంట్లు, ఇతర పేపర్లన్నీ కూడా అసెంబ్లీ కార్యదర్శి కస్టడీలో ఉంటాయి.
స్పీకర్ అనుమతి లేకుండా వీటిలో దేన్ని కూడా బహిర్గతం చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అంటే అసెంబ్లీ కార్యదర్శి కస్టడీలో ఉన్న దేనినైనా ఆయన బయటపెట్టాలంటే స్పీకర్ అనుమతిస్తే చాలు. స్పీకర్ రాతపూర్వక అనుమతి కూడా అవసరం లేదు. కేవలం మౌఖిక అనుమతి సరిపోతుంది. అయితే వీడియో ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరమని అదనపు ఏజీ ఎలా చెప్పారో మాకు అర్థం కాకుండా ఉంది.
అలా చేయడం హక్కుల ఉల్లంఘనే
హెడ్‌ఫోన్ విసిరిన ఘటన గవర్నర్ ప్రసంగం రోజున జరిగింది. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ కార్యకలాపాల కిందకు రాదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ హుందాతనానికి భంగం కలిగేలా వ్యవహరించడం, సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించడం వంటి కారణాలను తెలియచేస్తూ నోటీసులు ఇవ్వడం కూడా చేయలేదు. బహిష్కరణకు ముందు వివరణ కోరలేదు. వాదన వినలేదు. బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా కారణాలు చెప్పలేదు. ఎటువంటి వివరాలు లేకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 11 రోజుల తర్వాత తీర్మానాన్ని అప్‌లోడ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఇది జరిగింది. సభలో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదు. బహిష్కరణ తర్వాత అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందచేయలేదు. కోర్టు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఇదంతా కేవలం వి«ధానపరమైన లోపమని చెప్పడం సరికాదు.
హైకోర్టుకు వీడియో ఫుటేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ మొత్తం వ్యవహారంలో కోమటిరెడ్డి, సంపత్‌లను బలి పశువులను చేశారు. బహిష్కరణ అన్నది సభ్యుడికి కఠినమైన శిక్ష. ఈ శిక్ష వల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకుండా పోతాడు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఒక్క కలం పోటుతో వీరిద్దరినీ అనర్హులుగా చేసేశారు. దీన్ని కేవలం విధానపరమైనలోపంగా కాక, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నాం. పిటిషనర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారు. కాబట్టి అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట ప్రకారం చెల్లవు. సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని చెప్పిన సుప్రీంకోర్టు, సభ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని చెప్పింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్న ఏజీ వాదన సరికాదు. ఈ వ్యాజ్యంలో న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. వివాద నేపథ్యాన్ని చూస్తే సరైన వారినే ప్రతివాదులుగా చేర్చారు.
రాజీనామా చేయించిన ఆ హామీ
కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌పై బహిష్కరణ మొదలు.. తీర్పు వరకు ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వీడియో ఫుటేజీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసేందుకు జడ్జి సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం, అసెంబ్లీ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఆదేశాలు అవసరం లేదని, సీల్డ్ కవర్‌లో వీడియో ఫుటేజీలు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం చెప్పింది. ఆయనపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో ప్రకాశ్‌రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఏజీ రాజీనామా అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనమైంది.
ఆ తర్వాత ఈ కేసులో హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఏజీ హామీతో తమకు సంబంధం లేదన్నారు. వీడియో ఫుటేజీ ఇవ్వాలంటే సభ తీర్మానం అవసరమని, తీర్మానం లేదు కాబట్టి ఫుటేజీ ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ తర్వాత తాను, ఏజీ కలిసే హామీ ఇచ్చామని ఓసారి, తన సూచనతోనే వీడియో ఫుటేజీ సమర్పిస్తానని ఏజీ హామీ ఇచ్చారని మరోసారి చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలపై న్యాయమూర్తి సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఏఏజీ ప్రకటనలు న్యాయ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. చివరకు అసెంబ్లీతో తనకు సంబంధం లేదని, కేవలం ప్రభుత్వం తరఫునే వాదనలు వినిపిస్తున్నామంటూ.. మూడు పేజీలతో కౌంటర్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణతో తమకు సంబంధం లేదని మూడు పేరాల్లో తేల్చి చెప్పేశారు.
తీర్పును అమలు చేస్తారా?
హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ వర్గాలు అమలు చేస్తాయా? లేదా? అన్న విషయంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు న్యాయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ అనుసరించిన తీరును చూస్తుంటే తీర్పును అమలు చేసేలా కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవర్గాలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే నిజమైతే దాని పర్యవసానాలు రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ పూరిత వాతావరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం రాత్రి న్యాయ నిపుణులతో చర్చించారు.
బహిష్కరణకు భయపడ లేదు: సంపత్
‘‘అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించి నన్ను బహిష్కరణతో భయపెట్టాలని చూసింది. అయినా నేను భయపడలేదు.. వెనక్కి తగ్గలేదు. ఈ రోజు హైకోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడానికి ప్రజల ఆశీర్వాదంతో పాటు భగవంతుని అనుగ్రహమే కారణం. ఈ తీర్పు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక నుంచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతా
ప్రభుత్వ పతనానికి నాంది: కోమటిరెడ్డి
‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ, దేవుడున్నంత కాలం వంద మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ ఇచ్చిన అండదండలు, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మనోధైర్యంతో ప్రభుత్వ ఆగడాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ న్యాయ పోరాటానికి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అందించిన సహకారం, తోడ్పాటు మరువలేనిది. ఆయన బలంతో నిరంకుశ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు పోరాటం చేస్తా. మా సభ్యత్వాలను రద్దు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకున్నట్లయింది. ప్రభుత్వ పతనానికి ఈ తీర్పు నాంది కాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment