సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల బహిష్కరణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ రేపటికి( శుక్రవారం) వాయిదా పడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్ నోటిషికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సోమవారం హైకోర్టును కోరారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఇచ్చిన తీర్పును కోట్టేయాలని పిటిషనర్స్ తరపు న్యాయవాది వైద్యనాథన్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల తరపు అడ్వొకేట్ జంధ్యాల రవిశంకర్ కూడా తమ వాదనలు వినిపించారు.
అప్పీళ్లకు వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలకు అర్హత ఉందా లేదా అన్నదానిపై వాదనలు వినిపిస్తారా అని హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఏ సభ్యుడినైనా కారణం లేకుండానే రద్దు చేసే అధికారం ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ అధికారం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వైద్యనాథన్ తెలిపారు. వీరు వీడియో కావాలని అడుగుతున్నారంటే... స్పీకర్‌పైకి హెడ్‌ఫోన్స్ విసిరినట్టు ఒప్పుకున్నట్లేనని వైద్యనాథన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సభ్యులకు రక్షణ పరంగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలపాలని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment