కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో తీర్పు వాయిదా | Judgment was postponed in the case of Komatireddy and sampath issue | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో తీర్పు వాయిదా

Published Tue, Apr 10 2018 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Judgment was postponed in the case of Komatireddy and sampath issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వం రద్దుకు సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌ ప్రసంగంనాటి ఘటనకు సం బంధించి తమ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నల్ల గొండ, అలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫై చేయడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి, గాయపర్చామంటూ బహిష్కరించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశిం చాలని వారు కోర్టును కోరారు. దీనిపై ఇంతకుముందు జరిగిన విచారణల సందర్భంగా.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఇరువర్గాలు కౌంటర్లు దాఖలు చేయగా.. పిటిషనర్లు రిప్లై అఫిడవిట్‌ దాఖలు చేశారు. 

తమకు సంబంధం లేదన్న ఏఏజీ.. 
న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు సోమ వారం మరోసారి విచారణ జరిపారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) లేచి.. పిటిషనర్ల బహిష్కరణకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్‌ దాఖలు చేశామన్నారు.  

చట్ట ప్రకారం నడుచుకుందాం.. 
అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్రం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ హామీ ఇచ్చారని.. రాష్ట్రం అంటే ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా అని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏజీ హామీ విషయంలో వాదనలు అవసరం లేదని, వీడి యో ఫుటేజీ సమర్పిస్తామని ఏజీ స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని తమ ఉత్తర్వుల్లో నమోదు చేశామన్నారు. ఈ కేసులో వాదనలు వినిపించాలా? లేదా? అన్నది అసెంబ్లీ ఇష్టమని, ఈ విషయంలో కోర్టు వారిని బలవంతం చేయడం లేదని చెప్పారు. తాను మాత్రం చట్ట ప్రకారం నడచుకుంటానని, చట్టం చెబుతున్నదే చేస్తానని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.  

న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు.. 
తరువాత పిటిషనర్ల తరఫు న్యాయవాది పలు కేసుల్లో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు వెలువరించిన తీర్పులను న్యాయమూర్తికి వివరించారు. సభ నిర్ణయాలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, అహేతుకంగా ఉన్నప్పుడు ఆ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని... సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని తెలిపారు. అసలు బహిష్కరణ అన్నది నిబంధనల్లో ఎక్కడా లేదని.. లోక్‌సభ, రాజ్యసభలతోపాటు ఏ రాష్ట్ర శాసనసభ నిబంధనల్లోనూ ఆ ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు. ఇటీవలి పార్లమెంట్‌ సమావేశాల్లో సభ్యులు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించినా వారిని కనీసం సస్పెండ్‌ కూడా చేయలేదని కోర్టుకు వివరించారు. అసలు ఓ సభ్యుడిని బహిష్కరించే అధికారం శాసనసభకు లేదని.. కేవలం సస్పెన్షన్‌ అధికారం మాత్రమే ఉందని, ఆ సస్పెన్షన్‌ కూడా ఆ సెషన్‌కు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. కాబట్టి కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, బహిష్కరణను రద్దు చేయాలని అభ్యర్థించారు. 

అసలు కారణమేదీ? 
గవర్నర్‌ ప్రసంగం సభా కార్యకలాపాల కిందకు రాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాస్తవానికి పిటిషనర్లను ఎందుకు బహిష్కరించారో కూడా స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, వాదనలు మొదలైన తరువాతే బహిష్కరణ తీర్మానాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారని గుర్తుచేశారు. బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ గానీ, బహిష్కరణకు కారణంగా చెబుతున్న వీడియో ఫుటేజీని గానీ కోర్టుకు సమర్పించలేదని వివరించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘బహిష్కరణ ఉత్తర్వుల్లో పూర్తిస్థాయి వివరాలు లేవు కాబట్టి, అది పూర్తిస్థాయి కమ్యూనికేషన్‌ కిందకు రాదంటారు.. అంతేనా.? స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ వర్సెస్‌ అమర్‌సింగ్‌ హారికా కేసులో చెప్పింది ఇదే కదా?’’అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాది ఔనని సమాధానం ఇచ్చారు. అనంతరం వాదనలు ముగిసినట్టుగా ప్రకటించిన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement