సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు కొట్లాడారని.. అలాంటి వారికే రైతు సమన్వయ సమితుల్లో అవకాశమిచ్చామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ వారంతా పదవుల్లో సేదతీరుతుంటే.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోరాడి తెలంగాణ తెచ్చారన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే వారే సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉంటారని.. ప్రభుత్వ లక్ష్యానికి గండికొట్టేవారికి చోటుండదని స్పష్టం చేశారు. రైతుల అభ్యున్నతి కోసమే సమితులను నియమిస్తున్నామని.. రాష్ట్ర రైతు సమన్వయ సమితిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా వచ్చే ఏడాది చేసి చూపిస్తానని ప్రకటించారు.
సోమవారం శాసనసభలో ‘ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు’ అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. అసలు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు, రైతాంగం దుస్థితికి దశాబ్దాల పాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీలే కారణమని విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు నేరపూరిత నిర్లక్ష్యంతో వ్యవహరించాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీల పరంగా వివక్ష వహించని మొట్టమొదటి ప్రభుత్వం తమదన్నారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
రైతుల బాగు కోసం చర్యలు
‘‘మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లోని కాల్వ చివరి భూములకు 25 ఏళ్లుగా సాగునీరు రావడం లేదు. ఆ పరిస్థితి మారాలి. టెయిల్ ఎండ్‌కు నీరివ్వపోతే కాళ్లు విరగ్గొడతా అని మంత్రికి మీటింగ్‌లనే చెప్పిన. సీతారామ, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులు, కృష్ణా జలాలతో అన్ని జిల్లాలకు సాగునీరు అందిస్తం. ›ప్రాజెక్టుల నీరు వచ్చేదాకా అందుబాటులో ఉన్న భూగర్భ జలాలతో పంటలు పండించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తాం. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నియంత్రించేందుకు ఆ కేసులను పీడీ చట్టంలో చేర్చాం. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 2,638 మంది ఏఈవోలను నియమించాం. ఇప్పటికే 46 శాతం భూరికార్డులను పూర్తి చేసిన రెవెన్యూ అధికారులను అభినందిస్తున్నా.. నకిలీలకు ఆస్కారం లేని కొత్త పాస్ పుస్తకాలను ఇస్తం. ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.8 వేల చొప్పున సాయం అందిస్తం. కౌలు రైతుల సంగతి ఏమిటని అడుగుతున్నారు. కౌలు రైతులు మా ప్రాధాన్యత కాదు. కౌలుదారుల చట్టం ప్రమాదకరం. అసలు దారులే మాకు ముఖ్యం. కౌలుదారులు ఏటా మారుతుంటరు. అసలు దారులే వారి గురించి ఆలోచించాలి.
కొట్లాడినోళ్లే అవకాశం
మీరంతా (కాంగ్రెస్ వారు) పదవుల్లో సేదదీరుతుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. అటుకులు తిని, అన్నం బుక్కి కొట్లాడి తెలంగాణ కోసం సాధించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పునర్నిర్మాణం కోసం వారే కష్టపడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే వారే రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ లక్ష్యానికి గండికొట్టే వాళ్లకు చోటుండదు. సాగుభూమి లేనివారు సమితులలో సభ్యులుగా ఉండరు. అలా ఎక్కడైనా ఉంటే తొలగిస్తం. రాష్ట్ర రైతు సమన్వయ సమితిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం న్యాయ పరిశీలనలో ఉంది. రైతులకు, అధికారులకు మధ్య వారధిగా రైతు సమన్వయ సమితులు ఉంటాయి. ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు పోటీ ఉంటే రైతులు ధర పెడతరు. మండల రైతు సమన్వయ సమితులు ఈ విషయంలో ముందుగా స్థానిక వ్యాపారులకు చెబుతాయి. అయినా ధర రాని పరిస్థితులలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది. వచ్చే ఏడాదే నేను చేసి చూపిస్త. మేం చేసేది తప్పయితే ప్రజాకోర్టులో మాకు శిక్ష తప్పదు. లేదంటే మేమే మళ్లీ నెగ్గి వస్తం.
ఆటోస్టార్టర్లు తీసేయాలి
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఐదారు రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. కొన్ని సరిచేయాల్సిన పనులను చేస్తున్నాం. 2018లో సువర్ణయుగంలోకి ప్రవేశిస్తాం. వచ్చే జనవరి నుంచి అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా ఉంటుంది. రెప్పపాటు అంతరాయం లేకుండా చూస్తం. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత కరంటు ఇస్తున్న నేపథ్యంలో రైతులందరూ మోటార్లకు ఉన్న ఆటోస్టార్టర్లు తీసేయాలి. ఎమ్మెల్యేలు ఈ విషయంలో రైతులను చైతన్య పరచాలి. ఆటోస్టార్టర్లను తొలగించేందుకు డిసెంబర్‌లో రాష్ట్రమంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తం.
భట్టి విక్రమార్క బొమ్మ పెట్టాలా..?
నిజాం హయాం తర్వాత 80 ఏళ్లయినా రాష్ట్రంలో భూముల సర్వే, సెటిల్‌మెంట్లు జరగలేదు. ఆ అక్రమాలన్నింటినీ సరిచేసేందుకు భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి, కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామంటున్నం. కానీ కేసీఆర్ బొమ్మ వేసుకునేందుకే కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నరని భట్టి విక్రమార్క, కాంగ్రెసోళ్లు గాలి దుమారం రేపుదామని మాట్లాడుతున్నరు. అవును.. కొత్త పాస్ పుస్తకాల మీద కేసీఆర్ బొమ్మే పెడ్తం. లేకపోతే భట్టి విక్రమార్క బొమ్మ పెడతామా? అయినా పాస్‌బుక్‌ల మీద ఫోటో పెట్టుకుంటేనే పబ్లిసిటీ వచ్చే దుస్థితిలో కేసీఆర్ ఉన్నడా? స్థానిక సంస్థలు, మార్కెట్ యార్డులు అన్ని ఉన్నంక రైతు సమన్వయ సమితులు ఎందుకు అంటున్నరు. అవన్నీ ఉన్నా పంటలకు ధరలు ఎందుకు రాలే. రైతులు పంటలను ఎందుకు కాలబెడుతున్నరు? మార్కెట్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నరు? మంచిచేసే విషయంలో ప్రతిపాదనలు ఇస్తే తప్పక స్వీకరిస్తాం..’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాకౌట్
సీఎం కేసీఆర్ మాట్లాడిన అనంతరం ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలతోనే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.
కేసీఆర్ వర్సెస్ ఉత్తమ్
రైతుల రుణాలకు వడ్డీ మాఫీ అంశంపై కేసీఆర్, ఉత్తమ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. తొలుత కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డిగారు అందరికీ మెసేజ్‌లు పెడుతున్నరు. నేను రైతును కాబట్టి నాకూ మెసేజ్ వచ్చింది. వడ్డీ మాఫీ కాకుంటే చెప్పుమని అడుగుతున్నరు. లక్షలాది మెసేజ్‌లు పెడుతున్నా వాళ్లకు స్పందన రావడం లేదు.’’అని పేర్కొన్నారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘వడ్డీ మాఫీ నిధులు ఏ రైతులకు పడలేదనే వివరాలు సేకరిస్తున్నం. దాన్ని కచ్చితంగా ప్రభుత్వానికి ఇస్తాం. వడ్డీ నిధులు పడ్డాయో లేదో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడిగినా చెప్తరు..’’అని చెప్పారు. దీంతో కేసీఆర్ బదులిస్తూ.. ‘‘మేమేమీ ఫాల్స్ ప్రెస్టేజీకి పోవడం లేదు. జాబితా ఇవ్వాలనే అడుగుతున్నం. అలాంటిదేమైనా ఉంటే మాట్లాడి సరిచేస్తం. వడ్డీ మాఫీ జాబితాను స్పీకర్ ముందు పెడితే అన్నింటిపై ఒకేసారి నిర్ణయం తీసుకుందాం..’’అని చెప్పారు.
ఎన్నికలకు తొందరెందుకు?
రైతు సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎందుకో చిన్నారెడ్డి గారికి ఎన్నికలంటే భలే తొందరగున్నది. 60 నెలలు పాలించుమని ప్రజలు మాకు చెప్పిన్రు. ఇప్పటికి 40 నెలలే అయింది. రెండొంతుల కాలంలోనే మాకు వీలునన్ని కార్యక్రమాలు చేసినం. ఇంకో 20 నెలలుంది. ఆంధ్ర, తెలంగాణ విభజన లొల్లి, కేంద్రం ఉత్తర్వులు.. ఇవన్నీ పోను మాకున్న సమయంలో ఒక్కొక్కటి సెటిల్ చేసుకుంటూ వచ్చినం. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఉండదు. చిన్నారెడ్డి మా మిత్రుడు. ఆయనకు మంత్రి పదవి కోసం నేను కొట్లాడిన. ఈ విషయం ఆయనే అసెంబ్లీలో చెప్పిండు. అయినా చిన్నారెడ్డి ఆ పదవికి పూర్తిగా అర్హులు..’’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment