సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌కు నిధుల పంట పండింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్’అనే కొత్త పద్దు కింద ఏకంగా రూ.7,547 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.
భారీగా పెరిగిన పుర బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ 2020–21లో పురపాలక శాఖకు ప్రగతిపద్దు కింద రూ.11,020.37 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,261.98 కోట్లు కలిపి మొత్తం రూ.12,282.35 కోట్లు కేటాయించింది. 2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచింది.
కార్పొరేషన్లకు మళ్లీ కోత..
రాష్ట్ర ఆర్థిక సంఘానికి నిధుల కేటాయింపులను రూ.1,036.98 కోట్ల నుంచి రూ.889 కోట్లకు తగ్గించింది. రాష్ట్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద కేటాయింపులను రూ.521.73 కోట్ల నుంచి రూ.889 కోట్లకు పెంచింది. వడ్డీ లేని రుణాల పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులను రూ.75.47 కోట్ల నుంచి రూ.226.41కోట్లకు పెంచింది. వరంగల్‌కు రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను 2017–18లో కేటాయించిన ప్రభుత్వం, వరుసగా రెండో ఏడాది వీటికి రిక్తహస్తం చూపించింది. అయితే తొలిసారిగా మిషన్ భగీరథ (అర్బన్) పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది.
ఆలయాలకు రూ.400 కోట్లు
యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.350 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు కేటాయింపులను రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment