ఆరోగ్యమస్తు  | Telangana Budget Session On Health Department | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు 

Published Mon, Mar 9 2020 3:38 AM | Last Updated on Mon, Mar 9 2020 3:38 AM

Telangana Budget Session On Health Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యరంగానికి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,185.97 కోట్లు కేటాయించింది. 2019–20 ఆర్థిక సంవ త్సరంలో రూ. 5,694 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 491 కోట్లు కేటాయించడం విశేషం. మొత్తం వైద్య ఆరోగ్య బడ్జెట్లో రూ. 2,361.81 కోట్లు ప్రగతి బడ్జెట్‌ కాగా, 3,824.16 కోట్లు నిర్వహణ బడ్జెట్‌ కావడం గమనార్హం. ఈ ప్రగతి బడ్జెట్లో అత్యధికంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలో అమలయ్యే పథకాలకు అధికంగా రూ.1185 కోట్లు కేటా యించారు. గత బడ్జెట్లో రూ.886.49 కోట్లు కేటా యించగా, ఈసారి మరింతగా పెంచడం గమనార్హం.

ఆయుష్‌ విభాగానికి గత బడ్జెట్లో రూ. 6.86 కోట్లు ఇవ్వగా, ఈసారి 33.25 కోట్లు కేటాయించారు. అంటే గతం కంటే ఏకంగా రూ. 26.39 కోట్లు అదనం కావడం విశేషం.  ఇక ఎంతో ప్రాధాన్యం కలిగిన కేసీఆర్‌ కిట్‌కు గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా, ఈసారి 443 కోట్లకు తగ్గింది. ఈజేహెచ్‌ఎస్‌ స్కీంకు గతంలో రూ. 417 కోట్లు కేటా యించగా, ఈసారి 410.35 కోట్లు దక్కాయి. ఆరోగ్యశ్రీకి గతంలో రూ. 720. 12 కోట్లు కేటాయిం చగా, ఈసారీ అదే స్థాయిలో ఉంది. ఇక ఔషధాల కోసం గత బడ్జెట్లో రూ.236.14 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.262.41 కోట్లు ఇచ్చారు.ఇక ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసు పత్రికి గతంలో రూ.20 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడూ అంతే ఇచ్చారు.

ఆ వ్యాధుల నిర్ధారణకు కార్యాచరణ...
కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబం«ధిత వ్యాధుల నిర్ధారణ కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. తెలంగాణ లోని ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి . వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వాటి సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇప్పుడు నడుస్తున్న వాటితో పాటు, మరో 232 ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించాలని బడ్జెట్లో ప్రకటించారు.ప్రతీ డివిజన్‌లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రజల కంటి సంబంధ సమస్యలను పరిష్కరించడానికి కంటి వెలుగు పేరుతో ప్రపంచంలోనే అతి భారీ ఐ స్క్రీనింగ్‌ డ్రైవ్‌ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగానే మందులు, అద్దాలు పంపిణీ చేశారు.

కరోనాపై ప్రస్తావన...
రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రస్తావించారు. వేసవిలో ఉండే ఎండ వేడికి వైరస్‌ మనుగడలో ఉండే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమైనందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కరోనా వైరస్‌పై చెలరేగే వదంతులను నమ్మవద్దని బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది. ఇదిలావుండగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement