సాక్షి, హైదరాబాద్ :నగరంలో మెట్రో రైలు టికెట్ ధరలు ఆర్టీసీ నడుపుతున్న ఏసీ బస్సుల టికెట్ ధరల కన్నా తక్కువేనని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఏసీ బస్సుల్లో కనిష్ట ధర రూ.15, గరిష్ట ధర రూ.80 ఉంటే మెట్రోలో కనిష్ట ధర రూ.10, గరిష్ట ధర రూ.60గా ఉందని వెల్లడించారు. ఐదేళ్ల కింద ఆరంభించిన చెన్నై మెట్రోలో రోజుకు 70వేల మంది ప్రయాణిస్తుంటే, హైదరాబాద్ మెట్రోలో 3లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.గురువారం శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబులు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో అసెంబ్లీ భవనం, సుల్తాన్ బజార్‌ల మీదుగా మెట్రో ప్రతిపాదనలు వద్దన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మళ్లీ అదే ప్రాంతాల నుంచి ఎందుకు నిర్మాణం చేసిందని అడిగారు.
దీనికి తోడు టికెట్ ధరలు ఎందుకు పెంచారని, ప్రాజెక్టు ఆలస్యం కావడంతో వ్యయభారం పెరిగింది వాస్తవమేనా అని ప్రశ్నించారు.దీనికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ, ‘గతంలో గన్‌పార్క్‌ను పడగొడుతూ అలైన్‌మెంట్ ప్రతిపాదించడంతో టీఆర్‌ఎస్ సైతం వ్యతిరేకించింది.ఇప్పుడు అమరవీరుల స్తూపానికి నష్టం వాటిల్లకుండా 20మీటర్ల దూరం నుంచి మెట్రో వెళుతోంది. ఇక సుల్తాన్‌బజార్‌లోనూ వ్యాపారులతో మాట్లాడి, వారి ఆమోదంతో దుకాణ సముదాయాలకు నష్టం రాకుండా నిర్మాణం చేశాం. పాతబస్తీకి పాత అలైన్‌మెంట్ ప్రకారమే మెట్రో నిర్మిస్తాం’ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై 370 కేసులుంటే, సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలో∙360 కేసులు పరిష్కరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment