సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా పెరిగాయి.2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్‌తో పోల్చితే 2020–21 సంవత్సరం కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.26,306.25 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు.
ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం... గతేడాది సెప్టెంబర్ 9న 2019–20 వార్షిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ భారీగా తగ్గడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి యాక్టు కింద ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా తగ్గాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 వార్షిక సంవత్సరం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా పెరిగాయి. నిధుల కేటాయింపుల్లో జోరు పెరగడంతో సంక్షేమ పథకాల అమలులో వేగం పుంజుకోనుంది.
పెండింగ్ పనులకు లైన్ క్లియర్...
ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపులు భారీగా పెరగడంతో ఆయా శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. 2019–20 వార్షిక సంవత్సరంలో కేటాయింపులు భారీగా తగ్గడంతో ముందస్తుగా అనుకున్న పలు కార్యక్రమాలను ఆయా శాఖలు వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా నిర్మాణ పనులు చాలావరకు నిలిపేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా మండల, డివిజన్ స్థాయిలో నిర్మించాలనుకున్న అంబేడ్కర్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధి కాస్త నెమ్మదించింది. తాజాగా భారీగా నిధులు ప్రవేశపెట్టడంతో వాయిదా పడ్డ పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి. ఎస్డీఎఫ్ కింద కేటాయించిన బడ్జెట్‌ను దాదాపు 42శాఖలు సమన్వయంతో ఖర్చు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment