వడ్డీ చెల్లింపులకు 14,615 కోట్లు  | Telangana Budget Session On Payment Of Interest By Telangana Government | Sakshi
Sakshi News home page

వడ్డీ చెల్లింపులకు 14,615 కోట్లు 

Mar 9 2020 3:56 AM | Updated on Mar 9 2020 3:56 AM

Telangana Budget Session On Payment Of Interest By Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయ పట్టికలో రూ. 14,615 కోట్లను వడ్డీ చెల్లింపుల కింద ప్రభుత్వం చూపింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపుల కింద రూ. 14,574 కోట్లు ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 14,385 కోట్లు చెల్లించారు. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటుగానే వడ్డీ చెల్లింపులు చూపెట్టారు. అయితే, వడ్డీలకు తోడు రుణాలు, అడ్వాన్సుల అసలు చెల్లింపుల కింద రూ. 15,662 కోట్లు ప్రతిపాదించారు. దీంతో అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులు రూ. 30 వేల కోట్లు దాటాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ. 10,835 కోట్లు ఉండగా మూడేళ్లలో అది రూ. 3,780 కోట్ల మేర పెరిగిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి.

తప్పని అప్పుల తిప్పలు..
ఇక, ఈ ఏడాదీ పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్‌ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ. 35,500 కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే 2,600 కోట్ల రుణం ఎక్కువగా ప్రతిపాదించింది. ఇందులో ఓపెన్‌మార్కెట్‌ రుణాల కింద రూ.34 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర రుణాలు రూ.1000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.32,900 కోట్ల రుణాలు అంచనా వేయగా, రూ. 31,800 కోట్లు సమీకరించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తాయని అంచనా వేస్తే కేవలం రూ.200 కోట్లే వచ్చాయి. ఇక, ఇతర రుణాల కింద రూ.1000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదన ఉన్నా రూ.500 కోట్లు మాత్రమే కార్యరూపంలోకి వచ్చాయి.

మూలధన వ్యయం పెరిగింది.. 
కాగా, ఈ ఏడాదితో పోలిస్తే మూల ధన వ్యయాన్ని పెంచుతూ బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 17,274 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,165 కోట్లు ఖర్చయింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తమాన ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.8 వేల కోట్లు అధికంగా రూ. 22,061 కోట్లు మూల ధన వ్యయంగా ప్రతిపాదించారు. అదే 2018–19 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం 33,369 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 22,640 కోట్లకు తగ్గింది. ఇక, ఈసారి అంచనాల్లో ప్రతిపాదించిన మొత్తంలో ఎంత వ్యయం సంపద సృష్టికి జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement