సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఖర్చయిన మొత్తం అక్షరాలా రూ. 6 లక్షల కోట్లపైనే. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రగతికి బాటలు పడడం, హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతుండటంతో ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల రూపంలో కలిసొచ్చాయి. దీంతో 2016–17లోనే రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. ప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్ గురించి ఆలోచన చేయకుండా రాబడులను దాదాపు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో ఇప్పటివరకు రూ. 6.35 లక్షల కోట్లకుపైగా ఖర్చయింది.
సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2014–15లో రూ. 61,840 కోట్లు ఖర్చుకాగా ఆ తర్వాతి ఏడాది రూ. 90 వేల కోట్లు దాటింది. ఇక మూడో ఏడాది నుంచి రూ. లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు ప్రస్తుత ఏడాదికి వచ్చే సరికి రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి 100 శాతంకన్నా ఎక్కువకు చేరిందన్నమాట. గత ఆరేళ్లలో రూ. 6.6 లక్షల కోట్ల రాబడులు రాగా అందులో 96 శాతం మేర అంటే రూ. 6.3 లక్షల కోట్లను ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఖర్చు ప్రతి వ్యక్తిపై రూ. 1.81 లక్షలకుపైగా కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment