సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ఈ నెల 9న 2019–20 వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడింది. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనమండలి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 9న ప్రారంభం కాగా, ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు బడ్జెట్‌ను సమర్పించారు. ఆదివారం పలు బిల్లులను ఆమోదించాక నిరవధికంగా వాయిదా పడనుంది.
సభా కమిటీలపై ప్రకటన..
శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీ లు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మరోమారు అవకాశం దక్కనుంది. మంత్రులుగా, విప్‌లుగా అవకాశం దక్కని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా అవకాశం దక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment