శనివారం శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
సాక్షి, హైదరాబాద్: ‘సభలో అబద్ధాలు చెప్పే వారు అవసరమా? తీసి అవతల పారేద్దామా? అబద్ధాలతో ప్రజ లను తప్పుదోవ పట్టించేవారు సభలో ఉండటానికి అర్హులా?’అని రాజగోపాల్‌రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయి లో మండిపడ్డారు. సభలో అసత్య ఆరోపణలు చేసే వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చపై సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ‘శాసనసభలో ఏదిపడితే అది మాట్లాడటం కరెక్టు కాదు. కొత్త రూల్ అవసరమే. సింగపూర్‌లో ఒక చట్టం ఉంది. ఆరోపణ చేస్తే నిరూపించాలి. మన దగ్గర అలాంటి అవకాశం ఉందో పరిశీలించండి. ఇలాంటి వాటికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాడాలి. లేకపోతే అది రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరికీ మంచిది’అని సీఎం పేర్కొన్నారు.
ఆధారం లేకపోతే మాది అరణ్య రోదనే కదా!
‘మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకంపై పిచ్చి కూతలు కూసే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలోనే 334 ఆవాసాలకు నీళ్లు ఇచ్చాం. గ్రామ పంచాయతీల తీర్మానాలు ఉన్నాయి. నీళ్లు వచ్చాయని ఆయనే సంతకం చేశారు. మళ్లీ అబద్ధాలు చెబు తున్నారు. అంటే ఆయన సంతకం చేసింది అబద్ధమా? ఇదిగో ఆ పత్రం.. మీ దగ్గరే పెట్టం డి.. ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారో ఆలోచించండి. మినిస్టర్‌ను తిట్టారు. ఈ రుజువు లేకపోతే మా పరిస్థితేంటి.. అరణ్య రోదనే కదా.. గతంలో ఆయన అన్న గవర్నర్‌పై మైక్ విసిరారు. ఈ అరాచకం మంచిది కాదు. ఎక్కడో చోట దెబ్బ కొట్టాలి. మీరు సీరియస్‌గా తీసుకోవాలి. సహించొద్దు. గుణపాఠం చెప్పాల్సిందే. మీరే నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో నివేదిక తెప్పించుకొని చర్యలు చేపట్టండి’ అని పేర్కొన్నారు.
ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం
‘మిషన్ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం. ఇది అద్భుత పథకమని యావత్ దేశం ప్రశంసించింది. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.41 వేల కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.3 వేల కోట్లు అవసరం అవుతాయి. మిషన్ భగీరథ వల్ల నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య పోయిందని స్వయంగా కేంద్ర జల శక్తి శాఖనే ప్రకటించింది. భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ఇస్తున్నాం. అవికాకుండా అదనంగా రూ.90 లక్షలు కావాలని రాజగోపాల్‌రెడ్డి అడిగారు’ అని సీఎం వివరించారు.
వస్తామన్నా వద్దని వారించా
‘మా పార్టీ తరఫున 88 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. ఉప ఎన్నికల్లో మరొ కటి, ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే. మొత్తం 90 మంది ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటే నేనే వద్దని చెప్పా. రాజ్యాం గం ప్రకారం నడుచుకోవాలని చెప్పా. దానిపై తప్పుడు ప్రచారం చేయొద్దు. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు విలీనం అయ్యారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యారు’ అని కేసీఆర్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ సభ్యుడు విలీనంపై చేసిన ఆరోపణను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను సీఎం కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటోళ్లే ఓడిపోయారు..
‘ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటివాళ్లే ఓడిపోయారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు 4 శాతం ఓట్లే వచ్చాయి. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు పని చేస్తారనుకుంటే ప్రజలు వారినే గెలిపిస్తారు. గొంతు ఉంది కదా అని అసత్య ఆరోపణలు చేయొద్దు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. బ్యాలెట్‌తో జరిగిన జెడ్పీల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే మాట లేదు. గెలుపోటములపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేసుల మీద కేసులు వేస్తూ కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.
కేసులేసేది వాళ్లే.. నీళ్లు రావడం లేదని ఆరోపించేదీ వాళ్లే. ఉమ్మడి రాష్ట్రంలో అదే. ఇప్పుడు అదే పరిస్థితి. తెలంగాణపై మాట్లాడితే కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. మాపై ఎన్నో కేసులు పెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఆగలేదు. కాంగ్రెస్ నేతలు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు దక్కకుండా బీజేపీ కుట్రలు చేసింది. అభివృద్ధికి సహకరించకుండా ప్రతి దాన్ని రాజకీయం చేస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది’అని కేసీఆర్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment