సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళాబంధు కేసీఆర్’పేరిట సంబురాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అద్దం పట్టేలా ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది ‘మహిళాబంధు కేసీఆర్’పేరిట నిర్వహించాల్సిన సంబురాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మూడురోజుల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తొలిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడంతోపాటు గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, స్వయం సహా యక సంఘాల్లో చురుకైన మహిళలను సన్మానిస్తారు. కేసీఆర్ కిట్, షాదీముబారక్, థ్యాంక్యూ కేసీఆర్ వంటి అక్షరాలతో కూడిన మానవహారాలు ఏర్పాటు చేస్తారు.
కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పింఛన్లు వంటి కార్యక్రమాలతో లబ్ధి పొందతున్నవారి ఇళ్లకు వెళ్లి స్వీట్లు, చీరలు, గాజుల పంపిణీ చేస్తారు. పార్టీ రూపొందించిన కరపత్రాలతో ప్రచారం చేస్తారు. లబ్ధిదారులతో సెల్ఫీలు దిగి మహిళాబంధు కేసీఆర్, థాంక్యూ కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారు. 8వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు.
మహిళా సంక్షేమానికి అపూర్వకానుకలు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికసాయం చేయడంతోపాటు కేసీఆర్ కిట్ ద్వారా 11 లక్షల మందికి రూ.1,700 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు కేటీఆర్ తెలిపారు. మహిళల నీటికష్టాలు దూరం చేసేందుకు మిషన్ భగీరథను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
మాతాశిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. మహిళలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటు, బాలికలకు ప్రత్యేకంగా విద్యాసంస్థల ఏర్పాటు, 70 లక్షల హైజీనిక్ కిట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment