
ఆదుకున్నది అన్నదాతే!
పుష్కలంగా పడిన వర్షాల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగడంతో 2013లో వ్యవసాయ రంగమే మన ఆర్థిక వ్యవస్థను ఆదుకుంది
2005-10 మధ్య జీడీపీ 8-9 శాతంగా ఉరుకులు పెడుతుండగా 1.40 కోట్ల మంది ప్రజలు వ్యవసాయానికి దూరమయ్యారు. ఇలాంటి వారు తయారీ రంగ శ్రామికశక్తిలో భాగమవుతారని భావిస్తుంటారు. కానీ తయారీ రంగంలో సైతం 57 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. మనకు కనిపిస్తున్న వృద్ధి అంతా ఉద్యోగాలు లేని వృద్ధే.
పుష్కలంగా పడిన వర్షాల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగడంతో 2013లో వ్యవసాయ రంగమే మన ఆర్థిక వ్యవస్థను ఆదుకుంది. భారత ఆర్థిక వ్యవస్థలో సార్వత్రిక పతనం, విషాదం తాండవ మాడుతుండగా వ్యవసాయరంగం ఆశల వెలుగులను చిగురింపజేసింది. పారిశ్రామిక రంగ ఉత్పత్తి పుంజుకోవడంలో విఫలమవుతుంటే, తయారీ రంగం నేల చూపులే తప్ప పైకి చూడనని మొరాయిస్తుంటే, నిరుద్యోగం, ద్రవ్యలోటు పెరిగిపోతుంటే, వాణిజ్య లోటు ఆందోళనకరంగా పరిణమిస్తుంటే... వ్యవసాయరంగం మాత్రమే మంచి ఫలితాలను సాధించింది.
గోధుమ, వరి ఆహారధాన్యాల నిల్వలు ఎన్నడూ ఎరుగని అత్యున్నతమైన రికార్డు స్థాయిలో 8.23 కోట్ల టన్నులకు, ఆహార ధాన్యాల ఎగుమతులు 2 కోట్ల టన్నులకు పెరిగాయి. బియ్యం ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా ఆవిర్భవించింది. మొత్తంగా వ్యవసాయ ఎగుమతులు అసాధారణమైన రీతిలో వృద్ధి చెందాయి. 2010-11లో దాదాపు 12,000 కోట్లుగా ఉండిన భారత వ్యవసాయ ఎగుమతుల విలువ 2012-13లో ఇంచుమించు రెట్టింపై రూ. 20,000 కోట్లకు చేరింది. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం మాంసం ఎగుమతులే. బాసుమతి బియ్యం ఎగుమతులు పెరగడమే గాక రైతులకు మరింత మంచి ధర కూడా లభించింది.
వ్యవసాయరంగ వైభవమంతా ఇక్కడితోనే ముగిసిపోయింది. 60 కోట్ల మంది రైతులకు సంబంధించి 2013 కూడా ప్రతి ఏడాది లాగే మిగిలింది. కొత్త సంవత్సరం వచ్చేటప్పుడల్లా అన్నదాతకు అది కాసింత మెరుగైన సంవత్సరం అవుతుందని ఆశలు మొలకెత్తుతుంటాయి. కానీ ఏటికేడాది వారి పరిస్థితి దిగజారిపోతుండటమే చూడాల్సి వస్తోంది. చరిత్రలో కలిసిపోయిన 2013 అందుకు మినహాయింపు కాదు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతాలలో మరింత పెంపుదలకు ఏడవ ఫైనాన్స్ కమిషన్ వాగ్దానం చేస్తుండగా... రైతాంగం మాత్రం నిర్లక్ష్యానికిగురై, మరపునపడి సమాజపు అట్టడుగు పొరల్లోనే మిగిలిపోయింది. నిత్యమూ సగటున 2,500 రైతు కుటుంబాలు సాగు వదిలి భూమిలేని కూలీల సేనలో కలసి పోతున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నా, సరఫరాలకు సంబంధించిన ప్రతిబంధకాలు లేకున్నా 2013లో కూడా అసాధారణమైన ఆహార ద్రవ్యోల్బణం నెలకొంది. టోకు ధరల సూచిక ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా, వినియోగదారుల ధరల సూచిక ద్ర వ్యోల్బణం ఏడాదిలో అత్యధిక భాగం 10 శాతానికిపైనే ఉండిపోయింది. ఏ వివరణలూ కట్టలు తెంచుకుంటున్న వినియోగదారుల ఆగ్రహాన్ని చల్లార్చలే క పోయాయి. ఇటీవలే ముగిసిన రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో ఆ ఆగ్రహం అధికార పార్టీ ఘోర పరాజయంగా ప్రతిఫలించింది. పెచ్చు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అధికార పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
నిజానికి ద్రవ్యోల్బణం ప్రతికూల పరిస్థితుల దొంతరలాగా దెబ్బ తీసింది. 20,360 కోట్ల డాలర్ల భారీ వాణిజ్య లోటు, పెరిగిపోతున్న ద్రవ్యలోటు కళ్లముందు కనబడుతుండటంతో ఉపాధి కార్యక్రమాలతో పాటూ గ్రామీణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై పెట్టుబడులకు కూడా ప్రభుత్వం కత్తెర వేసింది. ఒకవంక నిరుద్యోగం పెరిగిపోతుండగా, ఆదుకోవాల్సి ఉన్న పేదలు తదితర వర్గాలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో మొత్తంగా చూస్తే పేదల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పేదరిక రేఖను పట్టణ ప్రాంతాలకు రూ. 28గా, గ్రామీణ ప్రాంతాలకు రూ. 24గా తగ్గిస్తూ ప్రభుత్వం గణాంకాలతో ఆటలాడుకుంది. అయినా పేదరికం పెరుగుతుండటమనే వాస్తవం మాత్రం అలాగే నిలిచి ఉంది.
అసాధారణమైన ధరల పెరుగుదల వల్ల పడిన అదనపు భారం ప్రభావాన్ని పరిహరించడానికే ప్రధానంగా కేంద్రం ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది. జనాభాలోని 67 శాతం లేదా 83 కోట్ల మందికి ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు లేదా చిరు ధాన్యాలు అందడానికి ఇది చట్టపరమైన హక్కును కల్పిస్తుంది. వ్యవసాయ రంగంలో తగినన్ని పెట్టుబడులు పెట్టకుండానే అమల్లోకి తెచ్చిన ప్రశంసనీయమైన ఈ లక్ష్యం సైతం అన్నదాత పస్తులు పడుకోవడం కొనసాగక తప్పదని సూచిస్తోంది. ‘ఆహార భద్రత’కు అవసరమైన తిండిగింజలను దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, హైవేల కోసం భూ సేకరణకు ప్రాధాన్యం ఇస్తోంది. కాబట్టి మొత్తం జనాభా అవసరాలను తీర్చగలిగేటంత ఆహార ఉత్పత్తి ఏటికేడాది మరింత కష్టమవుతుంది. వచ్చే మూడేళ్లలో మన దేశం నికర బియ్యం దిగుమతిదారుగా మారే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
రెండేళ్ల క్రితం అధిక స్థాయిలో 9.3 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రెండేళ్లలో... 2013లో 5 శాతానికి పడిపోయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయాభివృద్ధి అయినా జీడీపీని పైకి నెడుతుందని ఆశిస్తున్నారు. రెండేళ్లలోనే ఇలా వృద్ధి మందగించడానికి కారణం పారిశ్రామిక, తయారీ రంగాల ఫలితాలు అధ్వాన్నంగా ఉండటమే. 2013 బడ్జెట్‌లో రూ.5.73 లక్షల కోట్ల పన్ను మినహాయింపును ఇచ్చినా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రాని బకాయిలుగా మిగిలిన ఆస్తుల విలువ రూ.6 లక్షల కోట్లకు పైగానే ఉంది. అదే సమయంలో భారత కార్పొరేషన్ల వద్ద డబ్బు మూలుగుతోంది. ఈ వాస్తవం కూడా పారిశ్రామిక, తయారీ రంగాల ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నాయని, పన్ను రాయితీలు ఆస్తులు / లాభాలు పొగుపడటానికే తోడ్పడ్డాయని సూచిస్తోంది.
ఈ ఏడాది విడుదలైన ప్రణాళికా సంఘం నివేదిక ఒకటి భారత వృద్ధి కథనంలోని వైరుధ్యాలను వెల్లడి చేసింది. 2005-10 మధ్య జీడీపీ 8-9 శాతంగా ఉరుకులు పెడుతున్న సమయంలో 1.40 కోట్ల మంది ప్రజలు వ్యవసాయ రంగానికి దూరమయ్యారు. ఇలా వ్యవసాయ రంగాన్ని వీడినవారు తయారీ రంగ శ్రామికశక్తిలో భాగమవుతారని సాధారణంగా భావిస్తుంటారు. అయితే తయారీ రంగంలో సైతం 57 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆ నివేదిక తెలిపింది. మనకు కనిపిస్తున్న వృద్ధి అంతా ఉద్యోగాలు లేని వృద్ధేనని ఇది స్పష్టంగా సూచిస్తోంది.
తిరిగి ఉద్యోగావకాశాల కల్పనపై దృష్టిని కేంద్రీకరింపజేయడం కోసం 2013లో ప్రభుత్వం చేసిందేమీ లేదు. పెట్టుబడులు ఎక్కువగా పెట్టినంత మాత్రాన తప్పనిసరిగా ఉద్యోగాల కల్పన జరగాలని లేదనే విషయంపై కూడా సుస్పష్టంగా ఉండటం అవసరం. నూతన భూసేకరణ చట్టం అమల్లోకి వస్తుండటంతో చిన్నపాటి మడి చెక్కల నుంచి మరింత మందిని తరిమేయడం జరగక మానదు. అలాంటి వారంతా చిన్నాచితకా పనుల కోసం నగరాలకు వలస పోవడం పెరగక తప్పదు. మల్టీ బ్రాండ్ రిటైలు రంగంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ముడిపడిన కార్పొరేట్ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి దేశంలోని అతిపెద్ద ఉపాధి కల్పన వనరుగా ఉన్న వ్యవసాయ రంగం కూడా ఇకపై ఆ పాత్రను పోషించలేదు.