ఎగుడు దిగుడు జీడీపీ
పారిశ్రామిక చాంబర్లు, రేటింగ్ ఏజెన్సీల విభిన్న అంచనాలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై వివిధ ఆర్థిక, పారిశ్రామిక విశ్లేషణ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో పటిష్ట సంస్కరణలతో సైతం సమీప భవిష్యత్తులో 7-8 శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి కష్టమని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదిక పేర్కొంది. ఇక పారిశ్రామిక సంస్థ సీఐఐ సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, సంస్కరణలు చేపడితే ఈ ఏడాది 6% పైగా వృద్ధి సాధ్యమని పేర్కొంది. జీడీపీపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం పడుతుందని మరో ప్రధాన పారిశ్రామిక చాంబర్ అసోచామ్ హెచ్చరించింది.
అసోచామ్ అంచనా
ఎల్‌నినో కారణంగా వర్షపాతం 5%కకుపైగా తగ్గే అవకాశం ఉందని, దాంతో ఈ ఏడాది జీడీపీపై 1.75% ప్రభావం చూపవచ్చని అసోచామ్ నివేదిక తెలిపింది. వర్షపాతం తగ్గడంవల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరగవచ్చనీ, లక్షలాది నైపుణ్య రహిత ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చనీ పేర్కొంది. ‘దేశంలో సాగయ్యే భూమిలో 60 శాతానికిపైగా వర్షమే ఆధారం. వర్షపాతం ఒక శాతం తగ్గితే జీడీపీ 0.35 శాతం క్షీణిస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షాలు ఐదు శాతం తగ్గితే జీడీపీపై రూ.1.80 లక్షల కోట్ల (1.75 శాతం) మేరకు ప్రభావం ఉంటుంది..’ అని దేశ ఆర్థిక వ్యవస్థపై గురువారం విడుదల చేసిన నివేదికలో అసోచామ్ తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించడానికి కొన్ని సూచనలు కూడా చేసింది.
కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు నాణ్యమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేయాలి. ఈ ప్రాంతాల్లో సాగుచేసే ప్రత్యామ్నాయ పంటలకు ఆకర్షణీయమైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఉండాలి. అవసరానికి మించి నిల్వచేసిన తృణధాన్యాలను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా వీటి ధరలు పెరగకుండా చూడాలి.డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులు స్వేచ్ఛగా రవాణా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు12 సూత్రాల ప్రణాళికను ప్రభుత్వానికి అసోచామ్ అందించింది. వ్యవసాయ బీమా కవరేజీని విస్తరించాలని సూచించింది. పంటల బీమా క్లెయిమ్‌లను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించేలా ద్రవ్య సంస్థలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది.
మూడీస్ ఏమి చెబుతోందంటే..!
కొత్త ప్రభుత్వం పటిష్ట సంస్కరణలు చేపట్టినా ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో ఇప్పట్లో 7-8% స్థాయిలో వృద్ధి బాట పట్టే పరిస్థితి లేదు. మందగమనంలో ఉన్న మూలధన పెట్టుబడులకు తిరిగి ఊపు నివ్వడానికి ‘బ్రెజిల్ తరహాలో’ భారత్ ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయి.రుణం, జీడీపీ నిష్పత్తి ఈ యేడాది 65%కు మించవచ్చు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు ఆకర్షణీయంగానే ఉన్నాయని గ్లోబల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు పేర్కొనవచ్చు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పటిష్ట సంస్కరణల అజెండాను ప్రభుత్వం అనుసరిస్తుందని వారు అంచనా వేస్తుండడమే దీనికి కారణం. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, సంస్కరణల ప్రక్రియను సానుకూలంగా అమలుచేయడంలో సంబంధిత ప్రభుత్వం విఫలమైతే, ఈ అంచనాలు నిరుత్సాహం మిగిల్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో దేశ ఆర్థిక వృద్ధి 4.5-5.5 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది. 2015లో ఇది 5 నుంచి 6 శాతంగా నమోదుకావచ్చు.
2013 ముగింపునాటికి జీడీపీతో పోల్చితే కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 0.3 శాతానికి పడిపోయినప్పటికీ, బంగారంపై దిగుమతుల ఆంక్షలు తొలగించిన తరువాత ఇది ఇదే స్థాయిలో కొనసాగుతుందా? లేదా అన్నది సందేహమే. ద్రవ్యోల్బణం 8 శాతానికి పైగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో... స్వల్పకాలంలో రిజర్వ్ బ్యాంక్‌కు పరపతి విధానాన్ని సరళీకరించి, పాలసీ రేట్లను తగ్గించే అవకాశం లేదు. పైగా ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.
సీఐఐ ఇలా...
సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, కేంద్రం క్రమరీతిన సంస్కరణల అజెండాను అనుసరిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని సీఐఐ పేర్కొంది. ఇదే జరగబోతోందని కూడా తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. కొత్త ప్రెసిడెంట్, డీసీఎం శ్రీరామ్ గ్రూప్ హెడ్ అజయ్ ఎస్ శ్రీరామ్ గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15లో 6-6.5% శ్రేణిలో, రానున్న కొద్ది సంవత్సరాల్లో 8 శాతానికి పైగా జీడీపీ వృద్ధి రేటును భారత్ అందుకుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘వృద్ధి వేగం, ఉపాధి కల్పన’పై ఆయన సీఐఐ కార్యాచరణ ప్రణాళికను ఒకదానిని ఆవిష్కరించారు.