వడ్డీరేట్లు తగ్గాల్సిందే!
ముంబై: దేశ ఆర్థికాభివృద్ధికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని పారిశ్రామిక మండళ్లు సోమవారం విజ్ఞప్తి చేశాయి. ఇందులో భాగంగా కీలక పాలసీ రేట్లను తగ్గించాలని, కఠిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) విధానాన్ని సడలించాలని సూచించాయి. ఈ నెల 29వ తేదీన పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో జరిగిన ముందస్తు సమావేశంలో తమ విజ్ఞప్తులను మండళ్లు ఆర్‌బీఐ ముందు ఉంచాయి.
అసోచామ్ 10 పాయింట్ల ఎజెండా...
వృద్ధికి సంబంధించి పారిశ్రామిక సంస్థ అసోచామ్ రిజర్వ్ బ్యాంక్‌కు 10 పాయింట్ల ఎజెండాను సమర్పించింది. ముఖ్యంగా మౌలిక రంగంలో వృద్ధి పునరుద్ధరణకు పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని ఈ ఎజెండాలో ప్రస్తావించింది. ఇందుకు తగిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రత్యేకించి పట్టణ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల నిధులకు మునిసిపల్ బాండ్ల మార్కెట్‌ను మెరుగుపరచడం ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్ల విస్తృతిపై ఆర్‌బీఐ దృష్టి పెట్టాలని అసోచామ్ సూచించింది. ఫైనాన్షియల్ మార్కెట్ల సరళీకరణ, ఎగుమతుల రుణ లభ్యతా సౌకర్యాల మెరుగుదల, మొండి బకాయిల పరిష్కార మార్గాల అన్వేషణ, బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా క్యాడ్ కట్టడికి చర్యలు వంటి అంశాలను అసోచామ్ ప్రస్తావించింది.
రియల్టీకి పునరుత్తేజం అవసరం
కాగా గృహ రుణాలకు సంబంధించి కొన్ని రాయితీ రేట్లు అవసరమని రియల్టీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్‌బీఐ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిరనందని గ్రూప్ చీఫ్ నిరంజన్ హిరనందని విలేకరులతో మాట్లాడారు. హౌసింగ్ మార్కెట్ పుంజుకునే చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐని కోరినట్లు వెల్లడించారు.
చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వాలి: సీఐఐ
కఠిన పాలసీ విధానాన్ని సడలిస్తున్న సంకేతాలను ఆర్‌బీఐ తన రానున్న పాలసీ ద్వారా ఇవ్వాలని సీఐఐ కోరింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి ప్రత్యేక విండోను ప్రారంభించాలనీ కోరింది. ఈ కీలక రంగానికి తగిన వడ్డీరేటుకు రుణాలు అందేటట్లు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేసింది. మౌలిక రంగానికి ఇప్పటికే అందించిన రుణాలను వసూలు చేసే విషయంలో ఓపికపట్టే విషయాన్ని పరిశీలించాలని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసింది.
వడ్డీరేట్ల కోత కష్టమే...: నిపుణులు
కాగా... తీవ్ర ద్రవ్యోల్బణం పరిస్థితుల దృష్ట్యా రానున్న సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను ఆర్‌బీఐ తగ్గించకపోగా, పావుశాతం పెంచే అవకాశం ఉందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తం అవుతోంది. పాలసీ సమీక్షలో సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చిన రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు)ను మరో పావు శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు కొందరు భావిస్తున్నారు.
ఇదే జరిగితే ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న ఈ రేటు 7.75 శాతానికి చేరుతుంది. అయితే వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతా (లిక్విడిటీ) సమస్యా తలెత్తకుండా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు పావు శాతం తగ్గించే అవకాశం ఉందని కూడా నిపుణుల అంచనా. ఇదే జరిగితే ఈ రేటు ప్రస్తుత 9 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గవచ్చని భావిస్తున్నారు. రెపో మార్గం ద్వారా రుణ పరిమితి దాటితే- ఎంఎస్‌ఎఫ్ రూట్‌ను బ్యాంకులు(ఆర్‌బీఐ నుంచి రుణాలకు) ఆశ్రయిస్తాయి. కాగా ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) కేవలం 0.6% వృద్ధి సాధించిన నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రెపో రేటు తగ్గించాల్సిందేనని పారిశ్రామిక సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. టోకు ధరల సూచీ విషయానికి వస్తే- కోర్ గ్రూప్ వృద్ధి రేటు కేవలం 2.03 శాతమే ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఖరీఫ్ పంట దిగుబడులు, రూపాయి మారకపు విలువల స్థిరీకరణ ధోరణి రానున్న కాలంలో ద్రవ్యోల్బణాన్ని గాడికి తెస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ విశ్లేషించారు.