ఆర్థిక వ్యవస్థ రికవరీ: పరిశ్రమ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనబడుతోందని పరిశ్రమలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2016-17, ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వం మౌలిక రంగంపై భారీగా వ్యయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇది క్యూ1లో చక్కటి వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. వివిధ పారిశ్రామిక చాంబర్ల అభిప్రాయాలివి...
సీఐఐ: తగిన వర్షపాతం, గ్రామీణ డిమాండ్, సంస్కరణల అమలు వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశాభివృద్ధి రేటును 8 శాతం వద్ద నిలబెడతాయన్నది తమ అంచనా అని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందన్నది తమ అభిప్రాయమనీ, రానున్న కొద్ది కాలంలో ఈ ధోరణి మరింత పుంజుకుంటుందని భావిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. పలు రంగాలు దిగువస్థాయి వృద్ధి తీరు నుంచి ఎగువస్థాయి వృద్ధి ఎదిగినట్లు సీఐఐ-అసోకాన్ సర్వేలో వెల్లడైందని కూడా సీఐఐ తెలిపింది.
ఫక్కీ: ఊహించినదానికన్నా వేగంగా భారత్ రికవరీ జరుగుతోందని స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు పేర్కొంటున్నాయి. నాల్గవ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోడానికి నిదర్శనం. గడచిన రెండు సంవత్సరాలుగా కేంద్రం చేపట్టిన పలు సంస్కరణలు, అమలు దీనికి కారణమని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ పేర్కొన్నారు. మున్ముందూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
అసోచామ్: ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరగడానికి ఇది తగిన సమయం. ఉపాధి అవకాశాల మెరుగుదల, పటిష్ట వృద్ధి దీనివల్ల సాధ్యమవుతుంది. పెట్టుబడుల పునరుద్ధరణ భారీ స్థాయిలో జరగడమే వృద్ధి పటిష్టతకు ప్రధానంగా దోహదపడే అంశం. వస్తు సేవల పన్ను అమలుకు రాజకీయ ఏకాభిప్రాయ సాధనసహా, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతానికి తగిన పరిస్థితులను సృష్టించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.