
న్యూఢ్లిలీ: అమెరికా సర్కారు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పన్ను విధిస్తూ అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసిన నేపథ్యంలో, కీలకమైన భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సహకారం ద్వారా ఎగుమతుల పెంపుపై దృష్టి సారించాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ సూచించింది. అమెరికా ఒక్క దేశంతోనే మనకు 150 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు సరికాదని పేర్కొంది. ఎందుకంటే మన దిగుమతులు అన్నీ కూడా సహజ అవసరాలేనని గుర్తు చేసింది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువని, ఈ దృష్ట్యా ప్రతిఘటనకు అవకాశం లేదని పేర్కొంది. మన దిగుమతుల్లో చాలా వరకు అనివార్యమైనవని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మన ఎగుమతులపై ప్రభావం పడితే ద్వైపాక్షిక సహకారం ద్వారా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చానల్‌ను నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో ప్రభుత్వానికి సూచించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతుల బిల్లు 300 బిలియన్ డాలర్లుగా, దిగుమతుల బిల్లు 450 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని పేర్కొంది. దిగుమతుల్లోనూ ఒక వంతు చమురు ఉత్పత్తులేనని గుర్తు చేసింది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్ తదితర దేశీయంగా తగినంత ఉత్పత్తి లేని కమోడిటీలేనని తెలియజేసింది. అమెరికా అధిక పన్నులు వేసినందున స్టీల్ దిగుమతుల్లో ఉన్నట్టుండి పెరుగుదల ఉంటుందేమో దృష్టి పెట్టాలని సూచించింది. స్టీల్ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అవసరమైతే మరిన్ని ఉత్పత్తులను అధిక టారిఫ్ పరిధిలోకి తీసుకొస్తామ ని, అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు వాణిజ్య యుద్ధానికి సైతం సిద్ధమేనని ఆయన పేర్కొనడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment