రికవరీపై చిగురించిన ఆశలు
ముంబై: భారత ఆర్థిక రికవరీపై ఆశలు చిగురించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం పేర్కొంది. రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన, సహకారాత్మక విధాన నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థవంతంగా అమలు చేయగలదన్న అంచనాలు రికవరీకి దోహదపడే అంశాలని వివరించింది. మార్కెట్ల పరుగుకూ ఈ పరిణామం దోహదపడే అవకాశం ఉందని అంచనావేసింది. గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ముఖ్యాంశాలు...
ఆర్థిక, విధాన నిర్ణయాల అమలు పెట్టుబడుల ఊపునకు దోహదపడతాయి.వృద్ధికి, ద్రవ్య స్థిరీకరణకు మూలధన పెట్టుబడులు కీలకం.
ఆర్థిక వ్యవస్థకు కొన్ని ఇబ్బందులు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నప్పటికీ, కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు అంశాల్లో ప్రతికూలతలూ ఉన్నాయి.
గడచిన ఏడు త్రైమాసికాల్లో వృద్ధి-ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపు కొనసాగుతుండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలోనే ఉంది.
అధిక ద్రవ్యోల్బణం... పొదుపు, పెట్టుబడులు, వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వనరుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక రంగ సామర్థ్యాన్ని సైతం ద్రవ్యోల్బణం దెబ్బతీస్తోంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సరఫరాల సమస్యలను తగ్గించి, ద్రవ్యోల్బణం ఒత్తిడులను తొలగిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ఆర్‌బీఐ కొన్ని పరపతి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ పక్షంగా కొన్ని కీలక చర్యలు అవసరం. దేశీయంగా సరఫరాల అడ్డంకులను తొలగించడం, నిలిచిపోయిన ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. తద్వారా వృద్ధికి ఊపును అందించవచ్చు.
బ్యాంకింగ్‌పై ఇలా..: బ్యాంకుల్లో ఇటీవల మొండిబకాయిల సమస్య తగ్గుతోంది. దీనితో రుణ నాణ్యత మొత్తంగా మెరుగుపడింది. అయితే ఈ రంగంలో వ్యవస్థీకృత ఇబ్బందులు పెరుగుతున్నాయి. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), లాభదాయకత వంటి అంశాల్లో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రైవేటు రంగ బ్యాంకుల కన్నా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. అయితే పరిస్థితులు ఇదే విధంగా కొనసాగబోవన్న భరోసా ఉంది.