పుంజుకున్న జీడీపీ | Q1 GDP growth at 5.7% versus 4.6% QoQ; hits 2.5-year high | Sakshi
Sakshi News home page

పుంజుకున్న జీడీపీ

Published Sun, Aug 31 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

పుంజుకున్న జీడీపీ

పుంజుకున్న జీడీపీ

ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 5.7 శాతానికి అప్
రెండున్నర సంవత్సరాల గరిష్ట స్థాయి
సేవలు, తయారీ, మైనింగ్ చక్కని పనితీరు
 ఇదే ధోరణి కొనసాగుతుందన్న ఆశాభావం

 
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.7 శాతంగా నమోదయ్యింది. ఇది రెండున్నర సంవత్సరాల గరిష్ట స్థాయి. సేవలు, తయారీ, మైనింగ్ రంగాల మెరుగైన పనితీరు ఈ సానుకూల ఫలితానికి కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదే ధోరణి రానున్న త్రైమాసికాల్లోనూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ వ్యక్తం చేసింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శనివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 4.7 శాతం. చివరి త్రైమాసికంలో అంటే 2014 జనవరి-మార్చి కాలంలో వృద్ధి రేటు 4.6 శాతం. మొత్తంగా గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు 5 శాతం దిగువన కొనసాగింది. గడచిన ఆర్థిక సంవత్సరం తక్కువ స్థాయిలో గణాంకాల తీరు  తాజా ఫలితాలు పెద్దవిగా కనబడ్డానికి (బేస్ ఎఫెక్ట్) ఒక కారణమని కొందరు ఆర్థిక విశ్లేషకుల అంచనా.
 
ముఖ్య రంగాల తీరు
2013-14 ఇదే కాలంతో పోల్చితే తయారీ రంగం తాజా సమీక్షా కాలంలో 3.5 శాతం వృద్ధి సాధించింది. అప్పట్లో (2013 ఏప్రిల్-జూన్) ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.2 శాతం క్షీణత నమోదయ్యింది.   మైనింగ్ రంగం కూడా - 3.9 శాతం క్షీణత నుంచి 2.1 శాతం వృద్ధికి చేరింది.  ఆర్థిక సేవల రంగం అత్యధికంగా 10.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. తరువాతి స్థానంలో విద్యుత్ గ్యాస్, నీటి సరఫరా విభాగాలు 10.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. నిర్మాణ రంగం వృద్ధి రేటు 1.1 శాతం నుంచి 4.8 శాతానికి ఎగసింది. ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ల రంగాల్లో వృద్ధి 1.6 శాతం నుంచి 2.8 శాతానికి మెరుగుపడింది. అటవీ, మత్స్య సంపదసహా మొత్తం వ్యవసాయ రంగం మాత్రం మందగించింది. వృద్ధి రేటు స్వల్పంగా 4% నుంచి 3.8 శాతానికి తగ్గింది.
 
రికవరీకి సంకేతం: పరిశ్రమలు
ఆర్థిక వ్యవస్థ రికవరీకి తాజా ఫలితాలు తొలి సంకేతమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ‘ఆధునిక భారత ఆవిర్భావం’ విషయంలో ప్రధాని ఆకాంక్షలు నెరవేరడానికి విధాన నిర్ణయాల రూపకల్పన, అమలు దోహదపడతాయని, ప్రత్యేకించి తయారీ రంగం పురోభివృద్ధిలో ఈ అంశాలు కీలకమని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అన్నారు. ఇది కేవలం రికవరీకి సంకేతం మాత్రమేనని, 6 శాతం, ఆ ఎగువకు వృద్ధి రేటు చేరినప్పుడే 2014-15 పూర్తి ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అన్నారు.
 
రేటింగ్ సంస్థల పరిగణనలోకి: మయారామ్
తాజా ఫలితాలను ‘రేటింగ్ పెంచే విషయంలో’ ఆయా గ్లోబల్ రేటింగ్ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయన్న విశ్వాసాన్ని ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మయారామ్ వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాగా రానున్న 2,3 నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ దిశలో రూ.58,425 కోట్ల బడ్జెట్ లక్ష్యాన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.
 
క్రెడిట్ మాకే దక్కాలి: చిదంబరం
కాగా తాజా సానుకూల గణాంకాలకు తమ పనితీరే కారణమని, ఈ క్రెడిట్ యూపీఏ ప్రభుత్వానికే దక్కాలని మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. ఆర్థిక రంగం పునరుత్తేజానికి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితమే తాజా ఫలితమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement