ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13 శాతం నుంచి 15.7 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెలాఖరున అధికారిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు వృద్ధి తీరుపై తమ అంచనాలను వెలువరిస్తున్నారు. మహమ్మారి కరోనా మొదటి వేవ్ కారణంగా 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో అసలు వృద్ధి లేకపోగా 23.9 శాతం క్షీణించింది. ఇక 2021 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీగా 20.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.
ఇదే కాలంలో చోటుచేసుకున్న రెండవ వేవ్‌లో మొదటి వేవ్‌కన్నా ప్రాణనష్టం అపారంగా ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి రేటు (20.1 శాతం) నమోదుకు లో బేస్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఆగస్టు 5వ తేదీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ 16.2 శాతం వరకూ క్యూ1 వృద్ది రేటు ఉండవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన త్రైమాసికంపై (2022 ఏప్రిల్–జూన్) అంచనాలు, అభిప్రాయాలను పరిశీలిస్తే...
15.7 శాతం దాటినా దాటచ్చు...
మొదటి త్రైమాసికంలో జీడీపీ 15.7 శాతం దాటిపోతుందని భావిస్తున్నాం. తుది గణాంకాలు ఇంతకు మించి కూడా నమోదుకావచ్చు. ఇది వాస్తవరూపం దాల్చితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్‌బీఐ అంచనాలకు (7.2 శాతం) మించి జీడీపీ వృద్ధి రేటు నమోదుకావచ్చు. 41 రంగాలకు సంబంధించి 41 హై ఫ్రీక్వెన్సీ లీడిండ్ ఇండికేటర్స్ ప్రకారం, వృద్ధి విస్తృత ప్రాతిపదిక ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో కరోనా సవాళ్లతో రూ.4.77 లక్షల కోట్ల వరకూ గణనీయంగా పడిపోయిన వినియోగ వ్యయం 2021–22 మొదటి త్రైమాసికంలో 46 శాతం వరకూ రికవరీ అయ్యింది. 2022–23 క్యూ1లో మిగిలిన 54 శాతం రికవరీ అయ్యిందని సూచీలు తెలుపుతున్నాయి. సేవల రంగం రికవరీ ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష వాణిజ్యాన్ని యుద్ధం ప్రభావితం చేస్తున్న మాట వాస్తవమే. ఇంధనం, వస్తువుల ధరలు, వినియోగ విశ్వాసం, పాలసీ చర్యలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉన్న మాట నిజమే. అయినప్పటికీ ఈ సవాళ్లను తట్టుకోగలిన ఫండమెంటల్స్ పటిష్టతను భారత్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది.
– సౌమ్య కాంతి ఘోష్, ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్
13 శాతానికి పరిమితం అవుతుందని భావిస్తున్నాం...
అధిక బేస్ ఎఫెక్ట్‌తో పాటు (2021 ఇదే కాలంలో 20.1 శాతం వృద్ధి) గోధుమల ఉత్పత్తిపై వేసవి ప్రభావం, భౌగోళిక–రాజకీయ సమస్యలు, డిమాండ్–మార్జిన్‌లపై పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం క్యూ1లో వృద్ధి వేగాన్ని 13 శాతానికి తగ్గిస్తాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ సంబంధించిన ఉత్పత్తి (జీవీఏ) స్థూల విలువ జోడింపు విధానంలో వృద్ధి 12.6 శాతానికి పరిమితం కావచ్చు. జీడీపీలో మెజారిటీ షేర్ ఉన్న సేవల రంగంలో 17 నుంచి 19 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. 9 నుంచి 11 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం రెండవ స్థానంలో కొనసాగుతుంది.
ఆరవ నెలలోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఇటీవల కమోడిటీ ధరలు కొంత తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంత తగ్గవచ్చు. ఈ పరిస్థితిలో రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్)లో ద్రవ్యోల్బణం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ ఉండవచ్చు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనా (6.2 శాతం) ఇది ఎక్కువే కావడం గమనార్హం.
– అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్
Comments
Please login to add a commentAdd a comment