ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందనే భయాలు అధికమవుతున్నాయి. ఇటీవల గ్లోబల్‌గా స్టాక్‌మార్కెట్ ట్రెండ్ గమనిస్తే ఆ అనుమానం మరింత బలపడుతుంది. అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు, తగ్గిన ఆర్థిక శక్తి వెరసి మాంద్యం భయాలు అధికమవుతున్నాయి. దాంతో ఇటీవల ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పడుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా మార్కెట్లకుతోడు యూరప్, ఆసియా మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. మార్కెట్ సోమవారం(మధ్యాహ్నం 1:21 వరకు) నిఫ్టీ దాదాపు 713 పాయింట్లు, సెన్సెక్స్ అయితే ఏకంగా 2300 పాయింట్లు పడిపోయింది. అంటే సుమారు రూ.8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
మాంద్యంలోకి జపాన్..
జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, అంతకుముందు జులై–సెప్టెంబర్‌లో 2.9%, 2024 మొదటి త్రైమాసికంలో 0.5 శాతం క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగిస్తే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీనపడింది. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్ క్రమంగా దాని స్థానాన్ని కోల్పోతోంది.
బ్రిటన్‌లో ఇలా..
పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్‌ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ గతంలో నివేదించింది. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయింది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 4.7 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది.
ఆర్థిక సంక్షోభంలో చైనా..
చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా నేపాల్ నుంచి శ్రీలంక వరకు తన ఉనికిని విస్తరిస్తోంది. ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహాన్ని నటిస్తోంది. చైనా ప్రాపర్టీ రంగంలో భారీగా క్షీణించింది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆప్ స్టాటిస్టిక్స్(ఎన్‌బీఎస్) సీనియర్ అధికారి హె కెంగ్ గతంలో తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో కోట్ల మంది ప్రజలు నివసించవచ్చన్నారు. చైనాలోని డాంగ్-గ్వాన్ అనే నగరంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కోట్లుల్లో ఉందని కెంగ్ తెలిపారు. ఎన్‌బీఎస్-చైనా గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదు.
ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
మన మార్కెట్లపై ప్రభావం ఎంతంటే..
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా గుర్తింపు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలను నిరుద్యోగం, శ్రామికశక్తి, వనరులు, ముడిసరుకులు..వంటి ఎదోఒక సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. అయితే భారత్‌లో ఇలాంటి సమస్యలున్నా వాటి ప్రభావం చాలా తక్కువ. ఇది ఇండియా ఆర్థిక వృద్ధికి బలం చేకూరుస్తోంది. తాత్కాలికంగా దేశీయ మార్కెట్లు పడినా దీర్ఘకాలికంగా రెట్టింపు లాభాలను తీసుకొస్తాయి. ఇలా మార్కెట్లు పడిన ప్రతిసారి మదుపర్లు నష్టాలను పట్టించుకోకుండా మంచి కంపెనీలను ఎంచుకుని పెట్టుబడిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ జీడీపీ మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 8.2 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment