
ముంబై: ఒకపక్క పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)... మరోపక్క వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) దెబ్బకు మందగమనంలోకి జారిపోయిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కుతోందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(2017–18, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కోలుకోనుందని చెబుతున్నారు. 6.4 శాతంమేర నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. క్యూ2 జీడీపీ గణాంకాలను కేంద్రం నేడు (గురువారం) విడుదల చేయనుంది. తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్, క్యూ1)లో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టమైన 5.7 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ‘క్యూ1 దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోకి వస్తోంది. రెండో క్వార్టర్‌లో 6.3–6.4 శాతం మేర వృద్ధి రేటు(గ్రాస్ వేల్యూ యాడెడ్–జీవీఏ వృద్ధి 6.1–6.2%) నమోదవుతుందనేది మా అంచనా’ అని ఎస్‌బీఐ ఎకనమిస్ట్‌లు బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న తీవ్ర కుదుపుల నుంచి అన్నిరంగాల పనితీరు మెరుగుపడుతూ వస్తోందని.. సానుకూల స్థూల ఆర్థిక సంకేతాలు దీనికి బలం చేకూరుస్తున్నట్లు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రికవరీ సుస్పష్టం...
క్యూ1లో వృద్ధి దిగజారడానికి వినియోగ డిమాండ్ పేలవంగా ఉండటం, జీఎస్‌టీ అడ్డంకుల కారణంగా తయారీ రంగం క్షీణించడం, మైనింగ్ కార్యకలాపాల పతనం వంటివి ప్రధాన కారణంగా నిలిచాయని ఎస్‌బీఐ ఎకనమిస్ట్‌లు పేర్కొన్నారు. తాజా స్థూల ఆర్థిక సంకేతాలను పరిశీలిస్తే.. విస్తృత స్థాయిలో రికవరీ కనబడుతోందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా సెప్టెంబర్లో తయారీ ఉత్పాదకత వృద్ధి రేటు 10 నెలల గరిష్టానికి చేరడం(3.4 శాతం), మైనింగ్ రంగం 9.4 శాతం వృద్ధి(ఐదు నెలల గరిష్టం), విద్యుత్ ఉత్పాదకత 7.9 శాతానికి ఎగబాకడాన్ని పటిష్ట రికవరీకి నిదర్శనంగా పేర్కొన్నారు. దాదాపు 2,700 కంపెనీల ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. భవిష్యత్తుపై ఆశావహ ధోరణి స్పష్టంగా కనబడుతోందని ఎస్‌బీఐ తెలిపింది. ప్రధానంగా విమానయాన రంగంలో కంపెనీల ఆదాయం 28 శాతం ఎగబాకిన విషయాన్ని ప్రస్తావించింది.
ఇతర అంచనాలు ఇలా...
డీబీఎస్: క్యూ2లో వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని సింగపూర్ బ్రోకరేజి సంస్థ డీబీఎస్‌కు చెందిన ఎకనమిస్ట్‌లు అంచనా వేశారు. అయితే, తొలి క్వార్టర్‌లో వృద్ధి భారీగా పడిపోయిన నేపథ్యంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్లో 0.2 శాతం కోత విధించి 6.6 శాతానికి పరిమితం చేశారు.
హెచ్‌ఎస్‌బీసీ: పారిశ్రామికోత్పత్తి పుంజుకున్న నేపథ్యంలో జీవీఏ ఆధారిత వృద్ధి రేటు క్యూ2లో 6.3 శాతంగా ఉండొచ్చని బ్రిటిష్ బ్రోకరేజి దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది.
నేడు గణాంకాల వెల్లడి
ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయ్: మోర్గాన్ స్టాన్లీ
వచ్చే ఏడాది భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని అంత ర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో అంచనావేసింది. ఫైనాన్షియల్ వ్యవస్థ మెరుగుపడుతుందని, ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ ఆర్థిక స్థితిగతులూ పురోగమిస్తాయని నివేదిక వివరించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటుసైతం 7.5 శాతానికి చేరుతుందని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ మెరుగుపడటం, ఆరేళ్లుగా మందగమనంలో ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊపు... వెరసి 2018లో భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయి పునరుత్తేజానికి వీలుందని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది.
Comments
Please login to add a commentAdd a comment