
న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో మోదీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈసారి రైతులు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రగతి ఫలాలు రైతులకు అందకపోతే.. ఆర్థికంగా దేశం ఎంత అభివృద్ధి సాధించినా అది వృ«థాయేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా, తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆదివారమిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించిన ప్రయోజనాలు వ్యవసాయ రంగంలో కూడా స్పష్టంగా కనబడాలి. లేదంటే ఎంత వృద్ధిరేటు సాధించినా నిరుపయోగమే.
అందుకే రైతులకు వృద్ధి ఫలాలు దక్కేవిధంగా సాగు రంగంపై ప్రభుత్వం మరింత ఎక్కువగా దృష్టిసారిస్తుంది’ అని జైట్లీ తెలిపారు. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) ముందస్తు అంచనాల ప్రకారం ఈ ఏడాది(2017–18) జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టమైన 6.5 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. మోదీ సర్కారు హయాంలో ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటు కూడా. వ్యవసాయ రంగం, తయారీ రంగాల పేలవ పనితీరు వృద్ధి దిగజారడానికి ప్రధాన కారణమని సీఎస్‌ఓ అంచనాలు చెబుతున్నాయి. గతేడాది(2016–17)లో వ్యవసాయ రంగం వృద్ధి 4.9% ఉండగా... ఈ ఏడాది ఇది 2.1 శాతానికి పడిపోవచ్చనేది సీఎస్‌ఓ అంచనా. ఈ నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గోరుచిక్కుడు... ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రారంభం
నేషనల్ కమోడిటీ ఎక్సే్ఛంజ్(ఎన్‌సీడెక్స్)లో గోరు చిక్కుడు విత్తనాలకు సంబంధించి ఆప్షన్స్ ట్రేడింగ్‌ను ఆదివారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘దేశానికి రైతులు ఎనలేని సేవలందిస్తున్నారు. ఒకప్పుడు ఆహార కొరతతో అల్లాడిన మన దేశాన్ని ఇప్పుడు వ్యవసాయోత్పత్తుల్లో మిగులు సాధించేలా చేయగలిగారు. అయితే, రైతులకు తాము పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించడం లేదు.
ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అధిక ఉత్పత్తి కారణంగా ధరలు పడిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా దీనిపై ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. అయితే, ప్రభావం చాలా తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. రైతులకు మేలు చేసే ప్రధాన చర్యల్లో కమోడిటీ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రారంభం ఒకటి. మొదట్లో ఇది చాలా చిన్న చర్యగానే అనిపించొచ్చు. రానున్న రోజుల్లో అవగాహన పెరిగేకొద్దీ రైతులు దీనిద్వారా చాలా ప్రయోజనాలు పొందుతారు. పంటకు మెరుగైన ధర లభిస్తుంది’ అని చెప్పారు.
ఎన్‌సీడెక్స్... రెండో ఎక్సే్ఛంజ్
మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్(ఎంసీఎక్స్) తర్వాత కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించిన రెండో ఎక్సే్ఛంజ్ ఎన్‌సీడెక్స్. గతేడాది అక్టోబర్‌లో ఎంసీఎక్స్ గోల్డ్‌లో ఆప్షన్స్‌ను మొదలుపెట్టింది. కాగా, వ్యవసాయోత్పత్తుల ఆప్షన్స్ కాంట్రాక్టులకు సంబంధించి గోరుచిక్కుడే మొట్టమొదటిది. డెరివేటివ్స్ కాంట్రాక్టుల్లో భాగమే ఆప్షన్స్ ట్రేడింగ్.
ఏదైనా నిర్ధిష్ట ఉత్పత్తికి సంబంధించి ధరల్లో హెచ్చుతగ్గుల రిస్కులకు ప్రతిగా(హెడ్జింగ్) దీన్ని ప్రధానంగా ఉపయోగించుకుంటారు. భవిష్యత్తులో ధర పెరుగుతుందా, తగ్గుతుందా అన్న అంచనాలకు అనుగుణంగా ఈ ఆప్షన్స్ కాంట్రాక్టులను కొనడం/అమ్మడం చేస్తుంటారు. కాగా, ధరల పెరుగుదల లేదా తగ్గుదల రిస్కులను తట్టుకోవడానికి ఆప్షన్స్ ట్రేడింగ్ అత్యంత శక్తిమంతమైన సాధనమని ఈ సందర్భంగా ఎన్‌సీడెక్స్ ఎండీ, సీఈఓ సమీర్ షా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment