న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం (2018 ఏప్రిల్ 2019 మార్చి) అక్టోబర్–డిసెంబర్ (మూడవ త్రైమాసికం) ఫలితాలు వెలువడ్డాయి. ఈ కాలంలో వృద్ధిరేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు త్రైమాసికాల్లో (15 నెలలు) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అయినా ఈ స్థాయి వృద్ధి రేటు ప్రపంచంలోని ఏ దేశంలోనూ నమోదుకాకపోవడం గమనార్హం. ఇదే మూడు నెలల్లో చైనా 6.4 శాతం వృద్ధితో రెండవ స్థానంలో ఉంది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటును సాధిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతోంది. కాగా 2017–18 అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.7 శాతం. గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాల ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే...
► చూస్తే, 2018–19 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.35 లక్షల కోట్లు. 2017–18 ఇదే నెలలో జీడీపీ విలువ రూ.32.85 లక్షల కోట్లు. అంటే వృద్ధి 6.6 శాతంగా ఉందన్నమాట.
► వ్యవసాయం, తయారీ రంగంవృద్ధి తగ్గడం, బలహీన వినియోగ డిమాండ్ మూడవ త్రైమాసికంలో వృద్ధి స్పీడ్‌ను తగ్గించాయి.
► మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు ఇంతక్రితం 7.2 శాతంకాగా ఇప్పుడు 7 శాతానికి తగ్గించడం జరిగింది. ఇదే ఫలితం వెలువడితే, గడచిన ఐదు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి అవుతుంది. అయితే 7 శాతం స్థాయి వృద్ధి సాధించడానికి సైతం నాల్గవ త్రైమాసికంలో కనీనం 6.5 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. కాగా క్యూ4లో 6.5 శాతం వృద్ధి సాధనకు దేశ ఎగుమతుల్లో వృద్ధి కనీసం 14 శాతం ఉండాలని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ జరిగిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 8 శాతం అయితే, జూలై–సెప్టెంబర్ మధ్య ఈ రేటు 7 శాతంగా ఉంది. తొలి అంచనాలకన్నా (వరుసగా 8.2 శాతం, 7.1 శాతం) కేంద్ర గణాంకాల శాఖ ఈ వృద్ధి రేట్లను తగ్గించడం గమనార్హం.
► వినియోగ వ్యయం వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 8.4 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 9.9 శాతం.
► వ్యవసాయ రంగం వృద్ధి రేటు త్రైమాసికాల పరంగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. క్యూ1లో వృద్ధి రేటు 4.6 శాతం అయితే, క్యూ2లో 4.2 శాతంగా ఉంది. ఇక క్యూ3లో భారీగా 2.7 శాతానికి పడిపోయింది.
► వార్షికంగా చూస్తే, మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది.
► తయారీ రంగం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి6.7 శాతానికి దిగింది.
► సీఎస్‌ఓ అంచనాల ప్రకారం, 2018–19లో వ్యవసాయ రంగం 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. 2017–18లో ఈ రేటు 5 శాతం. తయారీ రంగం వృద్ధి మాత్రం 5.9 శాతం నుంచి 8.1 శాతం వృద్ధి పెరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, హోటెల్, రవాణా రంగాల వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గుతుంది. పెట్టుబడుల సూచీ స్థూల స్థిర మూలధన ఏర్పాటు (జీఎఫ్‌సీఎఫ్) రూ.48.97 లక్షల కోట్ల నుంచి రూ.55.02 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
తలసరి ఆదాయం రూ.92,718!
కాగా ఈ ఆర్థిక సంవత్సరం(2018–19) మొత్తంగా తలసరి ఆదాయం (2017–18తో పోల్చిచూస్తే) రూ.87,623 నుంచి రూ.92,718 కోట్లకు పెరిగే అవకాశం ఉందని గణాంకాల శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 5.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా.
మౌలిక రంగం నిరాశ
జనవరిలో కేవలం 1.8 శాతం వృద్ధి
19 నెలల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ జనవరి వృద్ధి ధోరణి నిరాశ కలిగించింది. వృద్ధి రేటు కేవలం 1.8 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (6.2 శాతం వృద్ధి) పోల్చిచూస్తే, 2019 జనవరిలో ఎనిమిది పరిశ్రమల బాస్కెట్ వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదయ్యిందన్నమాట. గడచిన 19 నెలల్లో (2017 జూన్‌లో కేవలం 1 శాతం) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 డిసెంబర్‌లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.7 శాతంగా నమోదయ్యింది. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం గ్రూప్‌లో పరిశ్రమలను వేర్వేరుగా పరిశీలిస్తే...
► క్రూడ్ ఆయిల్ (–4.3 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.6 శాతం), విద్యుత్ (–0.4 శాతం) రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. 2013 ఫిబ్రవరి తరువాత విద్యుత్ రంగంలో ఇలాంటి ప్రతికూల స్థితి నెలకొనడం ఇదే తొలిసారని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొంది.
► బొగ్గు (1.7 శాతం), సిమెంట్ (11 శాతం) రంగాల స్పీడ్ తగ్గింది. 2018 జనవరిలో ఈ వృద్ధి రేట్లు వరుసగా 3.8 శాతం, 19.6 శాతంగా నమోదయ్యాయి.
► కాగా సహజవాయువులు (6.2 శాతం), ఎరువులు (10.5 శాతం), స్టీల్ (8.2 శాతం) మెరుగైన పురోగతిని నమోదుచేశాయి.
► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎమినిది రంగాల వాటా దాదాపు 41 శాతం. జనవరి ఐఐపీ గణాంకాలు మార్చి రెండవ వారంలో వెలువడనున్నాయి. ఎనిమిది పరిశ్రమల పేలవ పనితీరు మొత్తం జనవరి ఐఐపీ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.
ఏప్రిల్ నుంచి జనవరి వరకూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) జనవరి వరకూ చూస్తే, ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment