హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. పండ్లు, కూరగాయలు, గ్రాసరీ ఏ నిత్యావసరాలైనా సరే నాణ్యమైనవే ఎంచుకుంటున్నారు. ఇదే బహుళ జాతి రిటైల్ కంపెనీలకు వ్యాపార అవకాశంగా మారింది. ఇప్పటివరకు చిన్న పట్టణాలలో నాణ్యమైన రిటైల్ కేంద్రాలు లేకపోవటం కార్పొరేట్ బ్రాండ్లకు కలిసొచ్చింది. ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాలలో పెద్ద కార్పొరేట్ చెయిన్స్, రిటైల్ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే మధ్యకాలంలో ప్రముఖ రిటైల్ బ్రాండ్స్ 120కి పైగా లీజు లావాదేవీలను నిర్వహించాయి. 400 చ.అ. నుంచి 35 వేల చదరపు అడుగులు విస్తీర్ణాలలో ఎఫ్‌అండ్‌బీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్‌ను ఏర్పాటు చేశాయి. బిబా, రిలయన్స్ ట్రెండ్స్, ప్యాంటలూన్స్, లెన్స్‌కార్ట్, వెస్ట్‌సైడ్, జుడియో, మ్యాక్స్ వంటి అపెరల్స్, లైఫ్ స్టయిల్ బ్రాండ్స్, స్టార్‌బక్స్, పిజ్జా హట్, కేఎఫ్‌సీ వంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ (క్యూఎస్‌ఆర్), క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైలర్లు హైస్ట్రీట్‌లో స్టోర్లను ఏర్పాటు చేశాయి. మోర్ రిటైల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ఫైజాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్, ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో స్టోర్ల ఏర్పాటు కోసం 14–30 వేల చ.అ. స్థలాలను లీజుకు తీసుకుంది.
తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లో సూపర్ మార్కెట్లు..
కార్పొరేట్ రిటైలర్లు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, గుర్గావ్ ప్రధాన నగరాలతో పాటు లక్నో, అహ్మదాబాద్, చంఢీఘర్, పాటియాలా వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్ వంటి చిన్న పట్టణాలల్లోనూ విస్తరిస్తున్నాయి. హైపర్, సూపర్ మార్కెట్ బ్రాండ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లోని హైస్ట్రీట్‌లో స్థలాలను లీజుకు తీసుకుంటున్నాయి. హైస్ట్రీట్ లీజు లావాదేవీలలో 23 శాతం వాటాతో అపెరల్ బ్రాండ్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఈ తర్వాత 15 శాతం వాటాతో ఎఫ్‌అండ్‌బీ బ్రాండ్లు, 12 శాతంతో జువెల్లరీ బ్రాండ్లు నిలిచాయి.
పట్టణాల్లో ఎందుకంటే..
ఇప్పటికే హైస్ట్రీట్‌లలో వినియోగదారులు రద్దీ గణనీయంగా ఉంది. ఇలాంటి చోట్ల రిటైలర్లు విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. తక్కువ సమయం, వ్యయంతో తక్షణమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే వీలుండటం రిటైలర్లు కలిసొస్తుందని అనరాక్ రిటైల్ జాయింట్ ఎండీ అండ్ సీఓఓ పంకజ్ రెంజెన్ తెలిపారు. మెట్రో నగరాలలో కొంతమంది రిటైలర్లు ఖరీదైన హైస్ట్రీట్‌లలో విస్తరణకు బదులుగా మంచి కనెక్టివిటీ, రోడ్ ఫేసింగ్ సైట్లలో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా టైర్–2, 3 పట్టణాలు బ్రాండ్లకు అధిక ఆదాయ వనరులను అందిస్తున్నాయి. నిధులు, మూలధన పెట్టుబడులున్న రిటైలర్లు పోటీతత్వ ప్రయోజనాన్ని పొందేందుకు, మార్కెట్ వాటాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment