Food and Drugs
-
చిన్న నగరాలకు రిటైల్ బ్రాండ్ల క్యూ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. పండ్లు, కూరగాయలు, గ్రాసరీ ఏ నిత్యావసరాలైనా సరే నాణ్యమైనవే ఎంచుకుంటున్నారు. ఇదే బహుళ జాతి రిటైల్ కంపెనీలకు వ్యాపార అవకాశంగా మారింది. ఇప్పటివరకు చిన్న పట్టణాలలో నాణ్యమైన రిటైల్ కేంద్రాలు లేకపోవటం కార్పొరేట్ బ్రాండ్లకు కలిసొచ్చింది. ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాలలో పెద్ద కార్పొరేట్ చెయిన్స్, రిటైల్ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే మధ్యకాలంలో ప్రముఖ రిటైల్ బ్రాండ్స్ 120కి పైగా లీజు లావాదేవీలను నిర్వహించాయి. 400 చ.అ. నుంచి 35 వేల చదరపు అడుగులు విస్తీర్ణాలలో ఎఫ్అండ్బీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్‌ను ఏర్పాటు చేశాయి. బిబా, రిలయన్స్ ట్రెండ్స్, ప్యాంటలూన్స్, లెన్స్‌కార్ట్, వెస్ట్‌సైడ్, జుడియో, మ్యాక్స్ వంటి అపెరల్స్, లైఫ్ స్టయిల్ బ్రాండ్స్, స్టార్‌బక్స్, పిజ్జా హట్, కేఎఫ్‌సీ వంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ (క్యూఎస్ఆర్), క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైలర్లు హైస్ట్రీట్‌లో స్టోర్లను ఏర్పాటు చేశాయి. మోర్ రిటైల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ఫైజాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్, ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో స్టోర్ల ఏర్పాటు కోసం 14–30 వేల చ.అ. స్థలాలను లీజుకు తీసుకుంది. తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లో సూపర్ మార్కెట్లు.. కార్పొరేట్ రిటైలర్లు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, గుర్గావ్ ప్రధాన నగరాలతో పాటు లక్నో, అహ్మదాబాద్, చంఢీఘర్, పాటియాలా వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్ వంటి చిన్న పట్టణాలల్లోనూ విస్తరిస్తున్నాయి. హైపర్, సూపర్ మార్కెట్ బ్రాండ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లోని హైస్ట్రీట్‌లో స్థలాలను లీజుకు తీసుకుంటున్నాయి. హైస్ట్రీట్ లీజు లావాదేవీలలో 23 శాతం వాటాతో అపెరల్ బ్రాండ్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఈ తర్వాత 15 శాతం వాటాతో ఎఫ్అండ్బీ బ్రాండ్లు, 12 శాతంతో జువెల్లరీ బ్రాండ్లు నిలిచాయి. పట్టణాల్లో ఎందుకంటే.. ఇప్పటికే హైస్ట్రీట్లలో వినియోగదారులు రద్దీ గణనీయంగా ఉంది. ఇలాంటి చోట్ల రిటైలర్లు విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. తక్కువ సమయం, వ్యయంతో తక్షణమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే వీలుండటం రిటైలర్లు కలిసొస్తుందని అనరాక్ రిటైల్ జాయింట్ ఎండీ అండ్ సీఓఓ పంకజ్ రెంజెన్ తెలిపారు. మెట్రో నగరాలలో కొంతమంది రిటైలర్లు ఖరీదైన హైస్ట్రీట్లలో విస్తరణకు బదులుగా మంచి కనెక్టివిటీ, రోడ్ ఫేసింగ్ సైట్లలో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా టైర్–2, 3 పట్టణాలు బ్రాండ్లకు అధిక ఆదాయ వనరులను అందిస్తున్నాయి. నిధులు, మూలధన పెట్టుబడులున్న రిటైలర్లు పోటీతత్వ ప్రయోజనాన్ని పొందేందుకు, మార్కెట్ వాటాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చదవండి: 2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు -
మార్కెట్లో నకిలీ వెన్న
సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వెన్న ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది. ఉత్సవాల సమయంలో తీపి పదార్థాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇందులో వెన్న వాడకం తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు నాణ్యత లేని, కాలం చెల్లిన, నకిలీ వెన్నను మార్కెట్లోకి సరఫరా చేస్తుంటారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎఫ్డీ అధికారులు వ్యాపారులను హెచ్చరించారు. నకిలీ వెన్నతో మిఠాయి తయారు చేసి ప్రజల ప్రాణాలకు హాని చేకూర్చవద్దని సూచించారు. కానీ వ్యాపారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో వస్తున్న నకిలీ వెన్నను కొనుగోలు చేసి మిఠాయి తయారీలో వినియోగిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని తెలిసినా లాభాపేక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా దాడులు గణేష్ ఉత్సవాల సమయంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్.డీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించి 29,688 కేజీల నకిలీ వెన్నను స్వాధీనం చేసుకొన్నారు. ఉత్సవాలు ప్రారంభమైన రెండు, మూడు రోజుల్లోనేరూ.13.58 లక్షలు విలువ చేసే 6,048 కేజీల నకిలీ, కుల్లిపోయిన వెన్న పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిపి భారీగా నకిలీ వెన్నను పట్టుకున్నట్లు ఎఫ్డీ పరిపాలన విభాగం కమిషనర్ పురుషోత్తం బాప్కర్ చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.56,04,246 ఉంటుందని చెప్పారు. నకిలీ వెన్నను ముంబై, శివారు ప్రాంతాల నుంచి అత్యధిక శాతం స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. 60 నమూనాలను ప్రయోగ శాలకు పంపించామని నివేదికరాగానే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎఫ్డీ నుంచి లెసైన్స్ పొందిన ఆధీకృత షాపుల నుంచి మిఠాయి, వెన్నను కొనుగోలు చేయాలన్నారు. -
ఎఫ్డీ కొరడా
సాక్షి, ముంబై : రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్డీ) అధికారులు దాడులు చేసి ఏకంగా రూ.36 కోట్లు విలువ చేసే నిషేధిత పాన్ మసాల పదార్థాలను జప్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్కా, తంబాకు, సుగంధ సుపారిలాంటి ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలు నిషేధించింది. అయినప్పటికీ ఈ పదార్థాలు అక్రమ మార్గాల ద్వారా కొందరు అక్రమార్కులు రాష్ట్రంలోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎఫ్.డి. పరిపాలన విభాగం దాడులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం దేశంలో 35 శాతం పెద్దలు తంబాకు, గుట్కాలాంటి ఆరోగ్యానికి హాని కల్గించే పదార్థాలకు బానిసలయ్యారు. రాష్ట్రంలో 29 శాతం పెద్దలు తంబాకు పదార్థాలు సేవిస్తుంటారు. తొమ్మిది శాతం పెద్దలు పొగతాగుతారు. ప్రభుత్వం రెండు సంవత్సరాల కిందట ఈ మత్తు పదార్థాలను నిషేధించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో గుట్కా, తంబాకు, సుగంధ సుపారి లాంటి పదార్థాలు తయారుచేయడం, వాటిని నిల్వచేయడం, విక్రయించడం లాంటివి చేస్తే నేరం. అయినప్పటికీ కొందరు వీటిని అక్రమంగా నగరంలోకి తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి.. ఎలా వస్తాయి పాన్ మసాల, గట్క, తంబాకు లాంటి పదార్థాలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైల్వే ద్వారా, కర్నాటక నుంచి బస్సులో వస్తాయి. అనేక సందర్భాలలో కోడి మాంసం తరలించే ఫ్రోజెన్ వాహనాల్లో, అలాగే చీరలు, వస్త్ర తాన్లు రవాణా చేసే ట్రక్కుల్లో పోలీసులు, చెక్‌పోస్టులవద్ద సిబ్బంది కళ్లుగప్పి సరఫరా చేస్తారు. వాస్తవంగా అందులో నిషేధిత గుట్క, తంబాకు, సుగంధ సుపారి లాంటి ఆరోగ్యానికి హానీ కలిగించే పదార్థాలుంటాయి. ఈ అక్రమ రవాణా ఇటీవల తీవ్రం కావడంతో అధికారులు సత్వర చర్యలకు పూనుకున్నారు. భారీగా దాడులు నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై అధికారులు దాడులు తీవ్రతరం చేశారు. 2012 జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్.డి. అధికారులు 67,914 చోట్ల దాడులు చేసి రూ.36 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఈ పదార్థాలను విక్రయిస్తున్న 1,212 వ్యాపారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 1,459 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. పట్టుకున్న మొత్తం రూ.36 కోట్లు విలువచేసే సామగ్రిలో రూ.24 కోట్లు విలువ చేసే పదార్థాలను ధ్వంసం చేశారు. మిగతా నిందితులపై చర్యలు తీసుకునేందుకు సాక్షాల కోసం అలాగే ఉంచారు. కోర్టులో విచారణ పూర్తికాగానే వాటిని కూడా ధ్వంసం చేయనున్నామని ఎఫ్.డి. పరిపాలన విభాగం కమిషనర్ మహేశ్ జగడే చెప్పారు.