సాక్షి, ముంబై : రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్‌డీ) అధికారులు దాడులు చేసి ఏకంగా రూ.36 కోట్లు విలువ చేసే నిషేధిత పాన్ మసాల పదార్థాలను జప్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్కా, తంబాకు, సుగంధ సుపారిలాంటి ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలు నిషేధించింది. అయినప్పటికీ ఈ పదార్థాలు అక్రమ మార్గాల ద్వారా కొందరు అక్రమార్కులు రాష్ట్రంలోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎఫ్.డి. పరిపాలన విభాగం దాడులకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా నిషేధం
దేశంలో 35 శాతం పెద్దలు తంబాకు, గుట్కాలాంటి ఆరోగ్యానికి హాని కల్గించే పదార్థాలకు బానిసలయ్యారు. రాష్ట్రంలో 29 శాతం పెద్దలు తంబాకు పదార్థాలు సేవిస్తుంటారు. తొమ్మిది శాతం పెద్దలు పొగతాగుతారు. ప్రభుత్వం రెండు సంవత్సరాల కిందట ఈ మత్తు పదార్థాలను నిషేధించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో గుట్కా, తంబాకు, సుగంధ సుపారి లాంటి పదార్థాలు తయారుచేయడం, వాటిని నిల్వచేయడం, విక్రయించడం లాంటివి చేస్తే నేరం. అయినప్పటికీ కొందరు వీటిని అక్రమంగా నగరంలోకి తరలిస్తున్నారు.
ఎక్కడి నుంచి.. ఎలా వస్తాయి
పాన్ మసాల, గట్క, తంబాకు లాంటి పదార్థాలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైల్వే ద్వారా, కర్నాటక నుంచి బస్సులో వస్తాయి. అనేక సందర్భాలలో కోడి మాంసం తరలించే ఫ్రోజెన్ వాహనాల్లో, అలాగే చీరలు, వస్త్ర తాన్లు రవాణా చేసే ట్రక్కుల్లో పోలీసులు, చెక్‌పోస్టులవద్ద సిబ్బంది కళ్లుగప్పి సరఫరా చేస్తారు. వాస్తవంగా అందులో నిషేధిత గుట్క, తంబాకు, సుగంధ సుపారి లాంటి ఆరోగ్యానికి హానీ కలిగించే పదార్థాలుంటాయి. ఈ అక్రమ రవాణా ఇటీవల తీవ్రం కావడంతో అధికారులు సత్వర చర్యలకు పూనుకున్నారు.
భారీగా దాడులు
నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై అధికారులు దాడులు తీవ్రతరం చేశారు. 2012 జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్.డి. అధికారులు 67,914 చోట్ల దాడులు చేసి రూ.36 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఈ పదార్థాలను విక్రయిస్తున్న 1,212 వ్యాపారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 1,459 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. పట్టుకున్న మొత్తం రూ.36 కోట్లు విలువచేసే సామగ్రిలో రూ.24 కోట్లు విలువ చేసే పదార్థాలను ధ్వంసం చేశారు. మిగతా నిందితులపై చర్యలు తీసుకునేందుకు సాక్షాల కోసం అలాగే ఉంచారు. కోర్టులో విచారణ పూర్తికాగానే వాటిని కూడా ధ్వంసం చేయనున్నామని ఎఫ్.డి. పరిపాలన విభాగం కమిషనర్ మహేశ్ జగడే చెప్పారు.
ఎఫ్‌డీ కొరడా
Published Mon, Jul 21 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement