దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.
ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్‌లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి.
జైపూర్ టాప్..
టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం.
ఉత్తరాదిన ఆగ్రా..
ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.
పశ్చిమాన గాంధీనగర్
పశ్చిమభారత్‌లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.
బలంగా డిమాండ్..
‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్‌లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment