సాక్షి, అమరావతి: రాష్ట్ర టెక్స్‌టైల్ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే యార్న్‌ను వినియోగించుకునే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో యార్న్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మన రాష్ట్రంలో మొత్తం 120 టెక్స్‌టైల్ మిల్స్ ఉండగా వీటిద్వారా ఏటా 6.87 లక్షల టన్నుల యార్న్ ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది నవంబర్ నుంచి ఊపందుకున్న వ్యాపారం పదిరోజుల నుంచి ఒక్కసారిగా ఆగిపోయిందని టెక్స్‌టైల్ కంపెనీల యజమానులు వాపోతున్నారు. గత పదిరోజుల్లో సుమారు రూ.900 కోట్ల విలువైన ఎగుమతులు ఆగిపోయాయని ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా రఘురామిరెడ్డి చెప్పారు.
ఒక్కో మిల్లు వద్ద కనీసం రూ.6 కోట్ల విలువైన యార్న్ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయినట్లు తెలిపారు. మహారాష్ట్ర, బెంగాల్‌లకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోగా, తమిళనాడు మార్కెట్‌కు కొద్దిగా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. దీంతో పెద్ద మిల్లులు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటుంటే, చిన్న మిల్లులు షిఫ్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. చిన్న మిల్లులు రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి పనిచేస్తున్నట్లు తెలిపారు. చాలా మిల్లులు మూడునెలల నుంచి ఉత్పత్తి సామర్థ్యంలో 90 శాతానికి చేరుకున్నాయని, ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో ఉత్పత్తిని 60 శాతానికి తగ్గించాయని పేర్కొన్నారు.
కూలీలను నిలబెట్టుకునేందుకు..
రాష్ట్రంలోని టెక్స్‌టైల్ మిల్లులపై ప్రత్యక్షంగా లక్షమంది, పరోక్షంగా నాలుగు లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో రెండులక్షల మందికిపైగా ఇతర రాష్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. లాక్‌డౌన్ మొదటి దెబ్బకి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన కూలీలను వెనక్కి రప్పించుకోవడానికి కంపెనీలు చాలా వ్యయప్రయాసలు పడ్డాయి. ఇప్పుడు తిరిగి కరోనా ఉధృతి పెరుగుతుండటంతో కూలీలను కాపాడుకోవడం కోసం ఉత్పత్తిని కొనసాగించాల్సి వస్తోందని ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దండా ప్రసాద్ తెలిపారు. ఉత్పత్తి లేకపోయినా పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి మరో 3 వారాలు కొనసాగే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment