మూఢాలు దాటితే మార్కెట్‌కు కళ! | Textile business starts with Ramadan Purchases | Sakshi
Sakshi News home page

మూఢాలు దాటితే మార్కెట్‌కు కళ!

Published Wed, May 27 2020 5:55 AM | Last Updated on Wed, May 27 2020 5:55 AM

Textile business starts with Ramadan Purchases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆషాఢం ధమాకా సేల్స్‌.. పెళ్లయినా, మరే శుభకార్యమైనా సకుటుంబ సపరివార దుస్తులకు మా వస్త్రాలయానికే విచ్చేయండి.. శ్రావణంలో బ్రహ్మాండమైన తగ్గింపు.. అన్ని రకాల వస్త్రాలకు కేరాఫ్‌ మా షోరూం.’ఏటా ఆషాఢం నాటికి హైదరాబాద్‌వ్యాప్తంగా కనిపించే సందడి ఇది. ఇక మూఢాలు ముగిసి పెళ్లిళ్లు మొదలయ్యే వేళ వస్త్రాలయాల ముందు కొనుగోలుదారుల వరుసలు.. షోరూంలన్నీపెళ్లింటిలాగా ముస్తాబు.. రంగవల్లికలు, మామిడి తోరణాలు, అరటి పందిళ్లు, విద్యుద్దీపాల వెలుగుజిలుగులు.. ఒకటేమిటి నగరవ్యాప్తంగా పెళ్లికళ తాండవించేది. ఇప్పుడు సరిగ్గా ఆ వేడుక ముందున్నాం కానీ ఆ కళ మాత్రం లేదు. కరోనా ధాటికి మార్కెట్‌ అంతా కకావికలమైంది. గతంలో ఎన్నడూ ఊహకందని రీతిలో అంతా దెబ్బతిన్నది.

ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియని అయోమయం నెలకొంది. కానీ ఆశ మిణుకుమిణుకుమంటోంది. మరికొన్ని రోజుల్లోనే క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటుందన్న భావన వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడుప్పుడే తెరుచుకుంటున్న వస్త్రాలయాలు కొనుగోలుదారులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. సరి–బేసి పద్ధతిలో దుకాణాలు తెరుచుకొని సరిగ్గా వారమైంది. వస్త్ర వ్యాపారం 20 శాతం బిజినెస్‌తో ముందుకు సాగుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత రంజాన్‌తో కొనుగోళ్లు మొదలవగా మూఢం దాటాక వచ్చే శుభముహూర్థాల కోసం వస్త్రాల మార్కెట్‌ ఎదురుచూస్తోంది. 

జూన్‌ చివర్లో కొనుగోళ్ల జోరు పెరిగే చాన్స్‌.. 
ఈమాత్రం వ్యాపారమన్నా ఉంటుందో లేదోనన్న అనుమానంతో తెరుచుకున్న వస్త్ర వ్యాపారం రంజాన్‌ బోణీ కొట్టింది. లాక్‌డౌన్‌ తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో రంజాన్‌ కొనుగోళ్లు జరిగాయి. ఈ పరిణామం వస్త్ర వ్యాపారుల్లో కొంత సానుకూల దృక్పథాన్ని కలగజేసింది. ఈమాత్రమన్నా జనం ఇళ్లు విడిచి వస్తారన్న భావన లేని సమయంలో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. జూన్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ఇవ్వనున్నందున మరికాస్త ఉత్సాహం మొదలవుతుందన్న అభిప్రాయాన్ని మార్కెట్‌ వ్యక్తం చేస్తోంది. జూన్‌ చివరి వరకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని, జూన్‌ చివర్లో ఆషాఢం మొదలవుతూనే జోరు పెరుగుతుందని ఓ ప్రముఖ షోరూం యజమాని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పటికి దేశంలో కరోనా పరిస్థితి, తదనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనల ఆధారంగా పరిస్థితి మెరుగుపడటమనేది ఆధారపడనుంది. 

మూఢాలు దాటే నాటికి ‘మంచి రోజులు’.. 
మూఢాలు దాటితే శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఆ మంచిరోజులు మార్కెట్‌కు కూడా వస్తాయని వస్త్ర వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. మే రెండో వారం దాటాక మూఢాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ చివర్లో అషాఢం మొదలు కానుంది. జూలైలో మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. అప్పటికి ప్రజల్లో కరోనా భయాందోళనలు తగ్గి కొనుగోళ్లపై దృష్టిసారిస్తారనే అంచనా ఏర్పడింది. 

భయం కొంత.. పొదుపు మరింత 
లాక్‌డౌన్‌ వల్ల చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిగా మారాయి. చిరు వ్యాపారులు నష్టపోవడం, కొన్ని కేటగిరీ ఉద్యోగులకు జీతాల్లో కోతపడటం.. వెరసి పొదుపుపై దృష్టిసారించాల్సి వచ్చింది. వానాకాలం అనగానే వ్యాధుల కాలం అంటారు. సీజనల్‌ వ్యాధులతోపాటు మళ్లీ కరోనా మరింతగా విజృంభిస్తే మళ్లీ కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో మరింత పొదుపునకు ప్రాధాన్యమిస్తూ కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. ఇది కూడా కొనుగోళ్లు మందగించేందుకు ఓ ప్రధాన కారణమని కొందరు వ్యాపారులంటున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుచుకుంటుండగా కొన్ని రోజులు వేచిచూద్దాం, అప్పుడే దుకాణాలకు వెళ్లకపోవడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. దీనివల్ల మందగమనం కొనసాగుతోందని ఎక్కువ మంది వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 

జూలై నాటికి 70 శాతం వ్యాపారానికి చాన్స్‌ 
లాక్‌డౌన్‌ తర్వాత 20 శాతం బిజినెస్‌తో వ్యాపారం ప్రారంభించాం. పరిస్థితులు మెరుగవుతాయన్న పూర్తి ఆశాభావంతో ఉన్నాం. కొన్ని రోజులు గడిస్తే జనం షోరూంలకు పెద్ద సంఖ్యలో వచ్చే పరిస్థితులు మొదలవుతాయి. జూన్‌లో మరో 15 శాతం వ్యాపారం జరుగుతుంది. పెళ్లిళ్లు జరగడం మొదలైతే జూలైలో 70 శాతం వ్యాపారం జరిగే చాన్స్‌ ఉంది. ఇక అక్టోబర్‌లో పూర్వ పరిస్థితులు వస్తాయన్న నమ్మకం ఉంది. 
– రాజేంద్రకుమార్, ఫౌండర్‌ ఎండీ, వీఆర్‌కే సిల్క్స్‌ 

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం 
ఆర్థిక ఇబ్బందుల కంటే కరోనా భయంతోనే జనం ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్‌కు రావట్లేదు. మరో రెండు నెలల్లో చాలా మెరుగైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అప్పటికి పరిస్థితులు దాదాపు చక్కబడొచ్చు. అయినా మేం కొనుగోలుదారులకు భరోసా ఇచ్చే రీతిలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు వస్తే ఇబ్బంది ఉండదు. కొనుగోలుదారులనే కాదు.. మా సిబ్బందిలో కూడా కాస్త టెంపరేచర్‌ ఎక్కువగా ఉన్నా షోరూమ్‌లోకి అనుమతించట్లేదు. భౌతికదూరం, శానిటైజేషన్‌ లాంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నాం. జనంలో భయం పోయే రోజులు త్వరలోనే ఉంటాయి.     
- పి. వెంకటేశ్వర్లు, ఫౌండర్‌ ఎండీ, ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement