సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ | AP is a leader in technology products | Sakshi
Sakshi News home page

సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ

Published Mon, Feb 19 2024 4:38 AM | Last Updated on Mon, Feb 19 2024 4:38 AM

AP is a leader in technology products - Sakshi

సాక్షి, అమరావతి: సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌) రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటీ–ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొద­టి నాలుగు స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్‌), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్‌), ఆటోమొబైల్‌ (మొబిటెక్‌), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్‌టెక్‌), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డ్‌టెక్‌), గృహోపకరణాలు (హోంటెక్‌), భారీ టవర్లు (ఇండుటెక్‌), ప్యాకింగ్‌ సామాగ్రి (ప్యాక్‌టెక్‌) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.

రాష్ట్ర­ం­లో ప్రధానంగా ఆగ్రో టెక్స్‌టైల్స్, మొబైల్‌ టెక్స్‌టెల్స్, జియో టెక్స్‌టైల్స్‌లకు భారీ డిమాండ్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్‌ తదితర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలు­వైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్ర­ంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది.

విశాఖపట్నంలోని మెడిటెక్‌ జోన్‌లో వైద్య పరికరాల ఉత్పత్తులు (మెడికల్‌ టెక్స్‌టైల్స్‌) ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్‌ వంటి అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న 15 టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ కంపెనీలు మనరాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్ర­ం­లో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌)­కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామి­కీ­­కరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నా­యి.  

రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే.. 
♦ మొబిటెక్‌: కియా, ఇసూజీ, అశోక్‌ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్‌ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో మొబిల్‌టెక్‌ ఉత్పత్తులకు చాలా డిమాండ్‌ ఉంది. 

♦ జియో టెక్స్‌టైల్స్‌: దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్యూ­బులు, జియో బ్యాంగ్‌లకు డిమాండ్‌ ఉంది. ఓడ­రేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు. తూర్పు­గోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్‌ సీవాల్‌ నిర్మాణం ఒకటి. ఇది దేశంలోనే మొదటి జియో టెక్స్‌టైల్‌ ట్యూబ్‌ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు. 

♦  ఆగ్రోటెక్‌ టెక్స్‌టైల్స్‌: ఉద్యాన రంగంలో ఉపయోగించే షేడ్‌ నెట్‌లు, పండ్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్‌ కవర్‌ ఉత్పత్తులు.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హారి్టకల్చర్‌లో ఆగ్రో టెక్స్‌టైల్స్‌ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్‌లోనూ ఫిషింగ్‌ నెట్స్, ఫిషింగ్‌ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్‌­టైల్స్‌కు అవకాశాలు ఉన్నాయి.

చేపల చెరు­వుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్‌ౖ­టెల్స్‌ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్వాక­ల్చర్‌ రంగం ఆగ్రో­టెక్‌కు ప్రధాన ప్రోత్సాహంగా నిలు­స్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్‌టైల్స్‌కు 30 శాతం డిమాండ్‌ ఉంది.
 
అరటి వ్యర్థాల ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్‌.. 
టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌లో అరటి వ్యర్థాలతో ఉత్పత్తులను తయారు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. అలాగే జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రంగానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్నారు.

రీసైకిల్‌ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్‌కిన్‌లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్‌ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్‌లు, నూలు, షూలు తయారు చేస్తున్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్‌ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8–10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్‌ ఉంది.. 
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తుల రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది. ఆగ్రో టెక్స్‌టైల్స్‌.. సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తున్నాయి. హార్టికల్చర్‌లో ఆగ్రో టెక్స్‌టైల్స్‌.. నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చా­యి.

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్‌ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నా­యి. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామ­ర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ టెక్నికల్‌ టెక్స్‌­టైల్స్‌కు ఉత్పత్తిదారుగానే కాకుండా అతి­పెద్ద వినియోగదారుగా కూడా ఉండనుంది.   – కె.సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి

రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న సాంకేతిక ఉత్పత్తులు.. 
జిల్లా                                 ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు 
అనంతపురం                   సీటు బెల్టులు, ఎయిర్‌ బ్యాగ్‌లు  
చిత్తూరు                                 శానిటరీ ప్యాడ్స్‌ 
తూర్పుగోదావరి                చేపలు పట్టే వలలు, లైఫ్‌ జాకెట్లు 
ప్రకాశం                               కన్వేయర్‌ బెల్ట్‌ 
పశ్చిమగోదావరి                జనపనారతో చేసిన హెస్సియన్‌ వస్త్రం 
విశాఖపట్నం                   సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్‌ బెల్టులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement