"మనం వికసిత్ భారత్ దిశగా అడుగులేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు దేశానికి కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందించాలి. అలాగే అందరికి సిరిసంపదలు సమకూర్చే ఆ మహాలక్ష్మి దేవికి వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నా.. మధ్య తరగతి వర్గాలు, పేదలకు ఆ మాత ప్రత్యేక ఆశీర్వాదాలు అందించాలి".
నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విలేకర్లతో అన్న మాటలివి. ఈ మాటల్ని తేలిగ్గా తీసిపారేయకూడదు. వాటిని విశ్లేషిస్తే ఎన్నో పరమార్ధాలు ధ్వనిస్తాయి.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో పేద, మధ్య తరగతి వర్గాలకు ఏదో కచ్చితమైన మేలు జరగబోతోందనే విషయం ప్రధాని మాటల్లో పరోక్షంగా ధ్వనించిందనే చెప్పొచ్చు.
మోదీ 3.O సర్కారు కొలువు తీరిన తర్వాత వస్తున్న తొట్టతొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీంతో ఈ బడ్జెట్‌కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అంతే కాదు.. ఈసారి విస్తృత స్థాయిలో పన్ను సంస్కరణలు చోటుచేసుకోవచ్చని, ఆదాయపు పన్నుల్లో అనూహ్య మార్పులకు ఆస్కారం ఉందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
బడ్జెట్ అనేసరికి ఆశలు సహజం.
ముఖ్యంగా మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు తమకు మేలు చేసే నిర్ణయాల కోసం ఎప్పటికప్పుడు ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఆదాయపు పన్నుల విషయంలో వీరి అంచనాలు కోటలు దాటుతాయి. వాస్తవానికి నిజాయతీగా పన్ను చెల్లించే వర్గం ఏదైనా ఉందా? అంటే అది ఉద్యోగులే. వీరికి జీతభత్యాలు చెల్లించేటప్పుడే టీడీఎస్ రూపంలో పన్ను వసూళ్లు జరిగిపోతాయి. కానీ ట్యాక్స్‌ల విషయానికొస్తే మాత్రం ఏళ్ల తరబడి స్వల్ప మార్పులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఫలితంగా అధిక పన్నులు చెల్లిస్తూ, అక్కరకు రాని ఆదాయాలతో మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు అల్లాడుతూనే ఉంటున్నాయి. కాబట్టి పన్ను రేట్లు తగ్గించడం, ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా గట్టి ప్రయోజనమే దక్కాలని ఈ వర్గాలు కోరుకోవడంలో తప్పు లేదు. పన్నుల విషయానికొస్తే..
* కొత్త స్లాబ్ ప్రకారం ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. ఆదాయాలు పెరిగినప్పటికీ, రేట్లు పెరిగి, ఖర్చులూ విస్తృతమైన నేపథ్యంలో ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారికి ఖర్చు పెట్టే సామర్ధ్యం పెరిగి, ఆర్ధిక వ్యవస్థ పురోగమించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
* పాత, కొత్త పన్ను విధానాలు రెంటిలోనూ స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం... పాత పన్ను విధానం ప్రకారం రూ.50,000 వరకు, కొత్త ట్యాక్స్ స్లాబుల ప్రకారం రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తోంది.
* రూ. 10 లక్షలవరకు పన్నులు ఉండకూడదని, రూ.15 లక్షలు పైబడి రూ.20 లక్షల లోపు ఆదాయాలకు 25% రేటుతో ఓ కొత్త స్లాబ్ ప్రవేశపెట్టాలని మరికొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
* రూ. 15 లక్షలు పైబడిన అధికాదాయ వర్గాల వారి నుంచి ప్రస్తుతం 30% పన్ను వసూలు చేస్తూండగా... దీన్ని రూ.18 లక్షలకు, ఇంకా వీలైతే రూ. 20 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. అంటే కొత్త ట్యాక్స్ విధానంలో మరిన్ని మినహాయింపులు, డిడక్షన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.
* మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల ప్రధాన కల సొంత ఇంటిని సమకూర్చుకోవడం. ఇందుకోసం వాళ్ళు రుణాలపైనే ఆధారపడతారు. కొత్త విధానం ప్రకారం.. తొలిసారి ఇల్లు కొనుక్కునేవాళ్లకు ఈ రుణాల తిరిగి చెల్లింపులో అసలు మొత్తంపై ప్రస్తుతం సెక్షన్ 80 సీ కింద లభిస్తున్న డిడక్షన్ ను రూ. 1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని వీరు కోరుతున్నారు. అలాగే సెక్షన్ 24 బీ కింద వడ్డీ తగ్గింపు పరిమితిని కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రస్తుతం క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ విధానం అందుబాటులో ఉంది. దీన్ని తమకూ వర్తింప చేయాలని ఆశిస్తున్నారు.
పాత విధానంలో ప్రస్తుత స్లాబ్ రేట్లు
రూ. 2,50,000 వరకు 0
రూ. 2,50,001 - రూ. 5,00,000: 5%
రూ. 5,00,001 - రూ. 10,00,000: 20%
రూ.10,00,000 పైన: 30 %
కొత్త విధానంలో ప్రస్తుత స్లాబు రేట్లు
రూ .3,00,000 వరకు: 0%,
రూ. 3,00,001 - 7,00,000: 5%,
రూ. 7,00,001 - 10,00,000: 10%,
రూ. 10,00,001 - 12,00,000: 15%,
రూ. 12,00,001 - 15,00,000 : 20%
రూ. 15,00,001 ఆపైన: 30%.
ఆదాయం రూ. 7 లక్షలు మించకపోతే... అదనంగా రూ. 25,000 వరకు ట్యాక్స్ రిబేటు కూడా లభిస్తుంది.
* వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయం రూ. లక్షల లోపు ఉంటే 87A సెక్షన్ కింద రిబేటు పొందవచ్చు. అంటే వారు ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. మోదీ నిన్న చెప్పినట్లు.. ఆ లక్ష్మీ కటాక్షం సీతారామన్ చేతుల్లోంచి పేద, మధ్యతరగతి.. ఉద్యోగ వర్గాలకు ఎంతవరకు సిద్ధిస్తుందో చూద్దాం.
-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment