రూ.2.52 లక్షల కోట్ల నిధుల కేటాయింపు
న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్‌లో రైల్వేశాఖ పద్దుల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. 2025–26 బడ్జెట్‌లో ఈ శాఖకు మొత్తం రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు మొత్తం రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తాయని అంచనా వేశారు. మరో 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు ప్రవేశపె ట్టేందుకు అనుమతి ఇచ్చారు.
వచ్చే నాలుగేళ్ల లో మొత్తం రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రకటన అనంతరం శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆదాయ అంచనా రూ.3 లక్షల కోట్లు
2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అన్ని మార్గాల ద్వారా రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2024–25 బడ్జెట్‌లో సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.2,79,000 కోట్లుగా ఉంది. గత బడ్జెట్‌లో ప్రయాణికుల చార్జీల ఆదాయం 2024–25లో రూ.80,000 కోట్లు ఉండగా, 2023–24లో రూ.70,693 కోట్లు వచ్చింది. 2024–25 బడ్జెట్‌లో సరుకు రవాణా ద్వారా రూ.1,80,000 కోట్ల ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు.
2023–24లో ఇది 1,68,199 కోట్లుగా ఉంది. రైల్వేల్లో భద్రతాపరమైన చర్యల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,14,062 కోట్లు ఉండగా, 2025–26 బడ్జెట్‌లో దీనిని రూ.1,16,514 కోట్లుగా అంచనా వేశారు. అయితే, ఇంతగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ రైల్వేలకు వస్తున్న ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుదల ఉండటం లేదని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్, టెలి కమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్రకుమార్ గోయెల్ చెప్పారు.
మరో 200 వందేభారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
దేశవ్యాప్తంగా మరో 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తక్కువ దూరంగల పట్టణాల మధ్య ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను మరో 100 ప్రారంభిస్తామని చెప్పారు. 17,500 కొత్త కోచ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment