బడ్జెట్‌ బతుకునిచ్చేనా? | Sakshi Guest Column On Union Budget 2025 Effect Poor People | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ బతుకునిచ్చేనా?

Published Thu, Jan 30 2025 12:35 AM | Last Updated on Thu, Jan 30 2025 12:35 AM

Sakshi Guest Column On Union Budget 2025 Effect Poor People

సందర్భం

2025, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రేవేశ పెట్టనున్నారు. గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈ బడ్జెట్‌పై అటు కార్పొరేట్‌ వర్గాలు, ఇటు మధ్యతరగతి – సామాన్య జనాలలో కూడా పెద్ద స్థాయిలో ఆసక్తి, అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రస్తుతం దేశంలో నెలకొంటోన్న ఆర్థిక మాంద్య వాతావరణం. మొన్నటి 2వ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటుతో పాటుగా ప్రజల కొనుగోలు శక్తికి కోతలు పెడుతోన్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతోన్న నిరుద్యోగం వంటి అనేకానేక సమస్యల వల్ల నేడు దేశీయ ప్రజల స్థితిగతులపై కారుమబ్బులు కమ్ముతున్నాయి. ఫలితంగా కార్పొరేట్ల అమ్మకాలూ, లాభాలూ కూడా నేలచూపులు చూస్తున్నాయి. 

కాబట్టి, ప్రస్తుత బడ్జెట్‌ ప్రజలకు ఉపాధి కల్పించేది, వారి కొనుగోలు శక్తిని పెంచేది, ద్రవ్యోల్బణానికి పరిష్కారం చెప్పేదిగా ఉండాలనేది అందరి ఆకాంక్ష. అయితే, గత మూడున్నర దశాబ్దాలుగా మన దేశంలో అమలవుతూ... గత దశాబ్ద కాలంగా మరింత ముమ్మరం అయిన  కార్పొరేట్‌ల, ధనికుల అనుకూల విధానాలను ఈ బడ్జె ట్‌లో ప్రభుత్వం విడనాడగలదా అనేది పెద్ద ప్రశ్న. 

ఈమధ్యే వెలువడిన ప్రత్యక్ష పన్నులూ, పరోక్ష పన్నుల వసూలు గణాంకాలు చూస్తే ప్రభుత్వ విధానాలు ఎవరికి అనుకూలంగా  ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025) లోని 2024 ఏప్రిల్‌– నవంబర్‌ కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకు వ్యక్తిగత పన్ను ఆదాయ వసూళ్ళు అంతకు ముందరి సంవత్సరం అదే కాలం కంటే 23.5 శాతం పెరిగాయి. కాగా, 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ పెరుగుదల అంచనా 13.6 శాతంగా ఉంది.  ఇక 2024 ఆర్థిక సంవత్స రంలో కూడా ఈ వసూళ్ళు... అంచనా కంటే (10.5%) అధికంగా (సుమారు 23 శాతం) ఉన్నాయి. 

కార్పొరేట్‌ పన్ను ద్వారా సమకూరే ఆదాయం 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో 12 శాతం పెరుగుతుందని అంచనా వేసుకోగా... వాస్తవంలో అది అంతకు ముందరి సంవత్సరం కంటే 0.5 శాతం తగ్గింది. 2019–20 కాలంలో కార్పొరేట్‌ పన్నును 10 శాతం మేర తగ్గించడంతో తగ్గిన వసూళ్ళు, తగ్గిపోయిన కార్పొరేట్ల లాభాల మొత్తాల
వంటివి దీని వెనుక ఉన్న కారణాలు.

ఏదేమైనా ఇక్కడ కనపడేది మధ్యతరగతి ఉద్యోగస్థులు, వ్యాపారులు, తదితరులు కట్టే వ్యక్తిగత ఆదాయ పన్ను మొత్తాల వసూళ్ళు అంచనాలను మించి పెరగడం... బడా కార్పొరేట్లు కడుతోన్న పన్ను మొత్తాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం అనేవి... ప్రభుత్వ కార్పొరేట్లు, ధనికుల అనుకూల విధానాలకు తార్కాణాలు. అలాగే, పరోక్ష పన్ను అయిన జీఎస్‌టీ వసూళ్ళ విషయంలో కూడా 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 2 శాతం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తే అది 8.7 శాతంగా ఉండడం గమనార్హం. 

ప్రభుత్వ విధానాలు జన సామాన్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయనేదానికి అంచనాలను మించిన ఈ జీఎస్‌టీ ఆదాయ పెరుగుదల తార్కాణం. అలాగే, కార్పొ రేట్‌ అనుకూల ప్రభుత్వ విధానాలకు మరో మచ్చు తునక ఎక్సయిజ్‌ ఆదాయం కూడా ఈ కాలంలో అంచనాల కంటే తగ్గుముఖం పట్టడం. దీనికి కారణం పెట్రోలియంపై లభించే భారీ లాభాలకు గాను కంపెనీలపై విధించబడే ‘విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌’ను ఉపసంహరించుకోవడం!

ఏ విధంగా చూసినా పెద్ద మనుషులకో నీతి; సామాన్య, మధ్యతరగతి జనానికో నీతిగా ప్రభుత్వ విధా నాలు నడుస్తున్నాయి. అలాగే, ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌  స్వయంగా వాపోయినట్లుగా... కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరిగిన స్థాయిలో... వాటి కార్మికులూ, ఉద్యోగుల జీతాలు పెర గడం లేదు. 

అలాగే, 2016 నవంబర్‌లో అమలు జరిగిన పెద్ద నోట్ల రద్దు... 2017లో అమలులోకి వచ్చిన జీఎస్‌టీ పన్ను విధానాల వల్ల దేశంలో లెక్కకు మించిన స్థాయిలో సూక్ష ్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతపడ్డాయి. అదే విధంగా అనేకమంది సాధారణ వ్యాపారులు జీవనోపా ధిని కోల్పోయారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగి పోయింది. అలాగే, 2020లో చుట్టు ముట్టిన కోవిడ్‌ మహ మ్మారిని ఎదుర్కోవడంలోని వైఫల్యాల వలన కూడా దేశంలో నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి తరలి వెళ్ళిపోయిన వలస కార్మికులలోని పెద్ద భాగం, నేటికీ తిరిగి నగర ప్రాంతాలకు పూర్తిగా రాలేదు. 

అంటే, నిజానికి దేశంలోని ఆర్థిక పరిస్థితులు కోవిడ్‌ ముందరి కాలం నాటి స్థితికి కూడా ఇంకా చేరుకోలేదన్న మాట. స్థూలంగా నేడు, కార్పొరేట్‌లకు పన్ను రాయి తీలు... ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పేరుతో నజరా నాలు, అలాగే వాటి బ్యాంక్‌ ఋణాల రద్దు (రైట్‌ ఆఫ్‌)లు ఒక ప్రక్క; సామాన్య మధ్యతరగతి జనాలపై ప్రత్యక్ష (ఆదాయపు పన్ను), పరోక్ష పన్నుల (జీఎస్టీ) భారాలు మరో పక్క నేటి ప్రభుత్వ విధానాలుగా ఉన్నాయి. 

అంటే, మార్కెట్‌లో తమ కొనుగోళ్ళ ద్వారా కార్పొరేట్ల సరుకులూ, సేవలకు డిమాండ్‌ను కల్పించే జన సామాన్యం కొనుగోలు శక్తిని, చేజేతులా కూలదోస్తోన్న ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మనే నరుక్కునే పిచ్చివాడి తీరుగా ఉన్నాయి. కాబట్టి, ఈ బడ్జెట్‌లోనైనా మన ‘స్వదేశీ’ విధానాల కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకుంటుందా?

గమనిక: ఈలోగా, పేద ప్రజానీకానికి ఉపశమనాన్ని ఇచ్చి... వారి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్‌టీ ఆదాయం పడిపోతోన్న కోవిడ్‌ కాలంలో కూడా  కొద్దిమేరనైనా ఈ ఆదాయం పెరుగుదలను చూపించగలిగిన  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల విధానాలూ... అలాగే 2008 ప్రపంచ ఆర్థిక
సంక్షోభ కాలంలో కూడా దేశీయ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడిన ‘జాతీయ ఉపాధి హామీ పథకం’ వంటి వాటిని మన మధ్యతరగతి వర్గం సానుకూలంగా చూడగలగాలి. నిజానికి ఈ వర్గానికి నష్టం చేస్తోంది ప్రభుత్వాల కార్పొరేట్, ధనికుల అనుకూల విధానాలే కానీ... అవి పేద ప్రజలకు ఇచ్చే కొద్దిపాటి రాయితీలు కాదనేది గుర్తించాలి!

డి. పాపారావు 
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్‌: 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement