కేంద్ర బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో బడ్జెట్ ప్రింటింగ్ కోసం లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత హల్వా వేడుక కూడా జరిగింది.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్‌మెంట్‌లో ముద్రించనున్నారు. నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రెస్ ఉంది. కానీ నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను చాలా కాలం ముద్రించలేదు. దీని వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది.
బడ్జెట్ ముందే లీక్
1950లో కేంద్ర బడ్జెట్ విషయంలో ఊహించని సంఘటన జరిగింది. అప్పట్లో మింటో రోడ్‌లో ఉన్న రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుండి కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకూ బడ్జెట్ పత్రాలను ఇదే ప్రెస్‌లో ముద్రించేవారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ 1950లో బడ్జెట్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాన్ని ముద్రించే స్థలాన్ని మరింత సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బడ్జెట్ పత్రాలు లీక్ అయిన సమయంలో జాన్ మథాయ్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసమే బడ్జెట్‌ను లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రణాళికా సంఘానికి నిరసనగా అప్పటి ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1980లో బడ్జెట్‌ను ముద్రించే స్థలం మరోసారి మారింది. నార్త్ బ్లాక్‌లోని ప్రస్తుత స్థానానికి మార్చారు.
'లాక్-ఇన్' పీరియడ్ అంటే..
బడ్జెట్ ముద్రణ ప్రక్రియ అత్యంత పటిష్టంగా, గోప్యంగా జరుగుతుంది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు బడ్జెట్‌పై పని చేస్తున్న అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. దీన్నే “లాక్-ఇన్” పీరియడ్ అంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ వ్యవధిలో అధికారులు తమ ఫోన్‌లను ఉపయోగించడానికి కూడా అనుమతించరు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాతే వారు బయలుదేరవచ్చు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు.
1980 నుంచే హల్వా వేడుక
బడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది.
భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment