వైద్యం.. దైన్యం
సాక్షి,కడప: నేటి బాలలే రేపటి పౌరులు.. ఇది మన నినాదం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ, శాఖల మధ్య సమన్వయలోపం.. చిన్నారులను పట్టించుకోకపోవడం....సక్రమమైన వైద్య పరీక్షలు లేకపోవడం.. వెరసి విద్యార్థుల ఆరోగ్యానికి గండం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో సుమారు 4500కు పైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఇవేకాకుండా ప్రైవేటు పాఠశాలలు కూడా దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ఐదు లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఎంతసేపు విద్యార్థి సక్రమంగా చదువుతున్నాడా....హోం వర్క్ బాగా చేస్తున్నాడా? లాంటి విషయాలు మాత్రమే చూస్తున్నారు తప్ప విద్యార్థుల ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి...పుట్టినప్పుడే అవయవ లోపం.. తర్వాత వచ్చే జన్యులోపం.. వినికిడిలోపం.. బుద్ధిమాంద్యం, వైకల్యం తదితర సమస్యలతో విద్యార్థుల జీవితాలు చిక్కి శల్యమవుతున్నాయి.
శాఖల మధ్య కనిపించని సమన్వయలోపం
చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టినా పిల్లలను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖతోపాటు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, అంధత్వ నివారణ సంస్థ, సర్వశిక్ష అభియాన్, ఐసీడీఎస్, వికలాంగుల సంక్షేమశాఖ తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. పాఠశాలల్లో అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన ఆపరేషన్లు చేయించాల్సిన బాధ్యత ఆయా శాఖలపై ఉంది. అయినా వీరెవరూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే పరిణామం.
అనారోగ్యంతో బాల్యం
2011-12 ప్రాంతంలో ఒకసారి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించారు. ఇటీవలి కాలంలో సర్వశిక్ష అభియాన్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం వేల మంది విద్యార్థుల్లో వికలత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రతి స్కూలుకు వెళ్లి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తే తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారి వివరాలు కూడా బయటికి వస్తాయి. వేంపల్లె మండలంలోని ఒకటి, రెండు పాఠశాలల్లో బీపీ, షుగర్‌లతోపాటు కడప నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులున్నట్లు సమాచారం.
పాఠశాలల్లో కనిపించని వైద్య పరీక్షలు
ప్రభుత్వాలు మారుతున్నా అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. విద్యార్థులకు సంబంధించి ప్రతినెల పాఠశాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించాల్సిన వైద్యాధికారులు ఎక్కడా కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నెలకొకమారు వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.