కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కేంద్రకారాగార సిబ్బందిని ఓ ఖైదీ హడలెత్తించాడు. తప్పించుకునే యత్నం చేశాడు. సుమారు 20 నిమిషాల పాటు ఎస్కార్ట్ సిబ్బందిని పరుగులు పెట్టించాడు.
చివరకు పట్టుపడ్డాడు. కడప కేంద్ర కారాగారం నుంచి ప్రతి శనివారం అనారోగ్యంతో బాధపడే ఖైదీలను వైద్య పరీక్షల కోసం రిమ్స్‌కు తీసుకు వస్తారు. ప్రత్యేక వాహనంలో వచ్చి తిరిగి కేంద్ర కారాగారంలోకి తీసుకువెళ్లే పూర్తి బాధ్యత ఎస్కార్ట్ సిబ్బందిపై ఉంటుంది. ఈ నేపధ్యంలో చిన్నసుబ్బయ్య (34) అనే ఖైదీకి పంటి సమస్య రా వడంతో దంతవైద్యశాలకు తీసుకొచ్చారు. పరీక్షలు చేయించుకుని తిరిగి వాహనంలోకి వెళ్లబోయే ముందు మూత్ర విసర్జన వెళ్లాలని ఎస్కార్ట్‌తో చిన్నసుబ్బయ్య అన్నాడు.
ఇందుకు అనుమతించిన ఎస్కార్ట్ కానిస్టేబుల్ కొంత దూరం చిన్నసుబ్బయ్య వెంట వెళ్లాడు. ఇదే అదునుగా భావించి చిన్నసుబ్బయ్య పరుగెత్తాడు. దీంతో ఉలిక్కిపడిన ఎస్కార్ట్ సిబ్బంది పరుగులు తీశారు. దాదాపు 20 నిమిషాలపాటు వారిని చిన్నసుబ్బయ్య ముప్పుతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు పట్టుకుని కేంద్రకారాగారానికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు మాట్లాడుతూ ఖైదీ పరారీ యత్నం చేయలేదన్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్లడంతో హడావిడి జరిగిందన్నారు. ఈ సంఘటనపై సమగ్రంగా విచారిస్తామన్నారు.
20 మినిట్స్
Published Sun, Feb 23 2014 2:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
Advertisement
Advertisement