మనోళ్ల కోసం వెళ్లిన విమానం
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యెమెన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం బయలు దేరింది. యెమెన్లో ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుందని, భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, తమను స్వదేశానికి తీసుకెళ్లాలని అక్కడి భారతీయులు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు యెమెన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రంగంలోకి దిగారు. యెమెన్ అధికారులతో చర్చలు జరిపి రోజుకు మూడు గంటలపాటు భారత విమానానికి అనుమతిని పొందారు.
దీంతో అక్కడి వారిని వెనుకకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏ 320 సోమవారం ఉదయం 7.45గంటలకు అక్కడి సనా విమానాశ్రయానికి బయలు దేరింది. ఏ 320కి 180 మంది ప్రయాణీకుల సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 3,500 మంది భారతీయులు ఉండగా వీరిలో నర్సులే ఎక్కువగా ఉన్నారు. ఒకే సారి 1500మందిని తరలించగల భారీ నౌకను కూడా యెమెన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సుష్మా స్వరాజ్ తెలిపారు. యెమెన్లో ప్రస్తుతం అన్ని విమానాశ్రయాలు మూతపడ్డాయి.