వివేచన హక్కుపై నిషేధమా? | Sakshi Guest Column On Smoking Eradication | Sakshi
Sakshi News home page

వివేచన హక్కుపై నిషేధమా?

Published Mon, Oct 7 2024 4:21 AM | Last Updated on Mon, Oct 7 2024 4:21 AM

Sakshi Guest Column On Smoking Eradication

కామెంట్‌

మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. 

ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.

అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్‌ కోసం స్టోవ్‌ (యూఎస్‌లోని వమాంట్‌ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్‌ సిగరెట్‌ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్‌’ (ప్రసిద్ధ బ్రిటిష్‌ కామెడీ సీరీస్‌)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. 

ఇద్దరు బ్రిటిష్‌ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్‌ చేస్తుంటుంది. 

‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్‌ ఆఫీసర్‌ గుసగుసగా అంటాడు. 
‘‘సిగరెట్‌ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్‌. 
‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’
‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్‌ పొడవంత ఉన్నాయి.’’
‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’
‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’

ఆ డైలాగ్‌ తర్వాత ఆ ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్‌ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్‌ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! 

‘యాక్‌’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్‌ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్‌లో ఆమె మళ్లీ సిగరెట్‌ తాగినట్లు నాకు గుర్తు లేదు.

ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టు
అందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. 

పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. 

మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. 

అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది.   

నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. 

పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. 

మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. 

అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. 

కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్‌ ప్యాకెట్‌ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). 

ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. 

మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. 

ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. 

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement